ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ సోదాలపై జరుగుతున్న రగడ తెలిసిందే. అనుమతులు, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆకస్మిక దాడులేంటని ఆయన కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ముమ్మాటికీ ఇది కక్ష సాధింపు చర్యేనని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే సీబీఐ స్వయంప్రతిపత్త ఉన్న సంస్థ తప్ప దాడుల్లో తమ ప్రమేయం లేదని కేంద్రం ప్రకటించింది కూడా. తాజాగా ఆయన రాజకీయ గురువు, ప్రముఖ సామాజిక ఉద్యమ కారుడు అన్నాహజారే ఈ దాడులపై స్పందించారు. అయితే ఈ విషయమై ఆయన శిష్యుడికి పెద్ద షాకే ఇచ్చారు.
రాలెగావ్ సిద్దీలో అన్నా మాట్లాడుతూ... కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ పై అవినీతి ఆరోపణలు ఇప్పటివి కాదని అన్నారు. రాజేంద్ర కుమార్ పై గతంలోనే ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. పోనీ, ఆయనను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించే ముందైనా అతని గురించి కేజ్రీవాల్ తెలుసుకుని ఉండాల్సిందని అన్నారు. అధికారం చేపట్టిన తర్వాత గత ఏడాదిన్నరగా కేంద్రంలోని బీజేపీ కూడా ఆ పని చేయలేదని ఆయన ఆక్షేపించారు. రాజేంద్ర కుమార్ పై గతంలోనే చర్య తీసుకోవాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. తన చుట్టూ దృఢమైన వ్యక్తిత్వం కలవారినే ఉంచుకోవాలని తాను కేజ్రీవాల్ కు ఎప్పుడూ చెబుతుంటానని హజారే తెలిపారు. మొత్తానికి ఇలా గురువు గారి నుంచే అక్షింతలు పడటంతో నాలిక్కరుచుకోవటం కేజ్రీవాల్ వంతు అయ్యింది.