పార్లమెంట్ తొలినాళ్లల్లో అద్భుతమైన వాగ్ధాటితో సభను, దేశాన్ని మంత్ర ముగ్ధుల్ని చేసే మహామహులుండేవారు. దీనిపై ఒక విశ్లేషణ ఉండేది. మన స్వాతంత్ర్య సమరం అహింసా మార్గంలో, శాంతియుతంగా జరిగే దిశానిర్దేశం గాంధీ ప్రభృతులు చేశారు. బోసు, భగత్ సింగ్ లాంటి కల్తీలేని కొద్దిమంది దేశ భక్తులు వారు నమ్మిన పంథాననుసరించి అమరులైనారు. అహింసో పరమ ధర్మహ అనుకోవడం వలనే కత్తులు, కటార్లు లేకుండా, మాటల తూటాలతో, వాక్ చాతుర్యంతో భారతదేశ బానిస సంకెళ్లను త్రెంచుకోండని సమర శంఖం పూరించే వక్తృత్వపు నిష్నాతూలు దేశమాతకు లభించిన రోజులవి.
పిదపకాలం దాపురించింది. మాతృభాష తెలుగుకే దిక్కులేదు. అలాగని ఆంగ్లంలో ఏం వెలగబెడుతున్నారు. రెంటికీ చెడుతున్నరేవడి. రాజకీయాల్లోకి సుష్టుగా చదువుకుని, విషయ పరిజ్నానం ఉన్నవారు తక్కువే మరి. చంద్రబాబు ఎం.ఏ. ఎకనామిక్స్ చదువుకున్నారు. ఇంగ్లీషులో కమ్యూనికేటు చెయ్యగలిగి అలా ముందకు పోతారు. తెలుగు ఛానెళ్లు వాడే తెలుగు ఎంత అపభ్రంశంగా ఉంటుందో తెలుసుగా. అంచేత ఫర్వాలేదు. ఇక జాతీయ ఛానళ్లు పుష్కరాళ్లకు వేంచేశారు. బాబుగారి పరివారం, పుష్కరాల్లో జరిగిన ఘోరాన్ని విపులింగా అర్థమయ్యే రీతిలో వివరించలేనందుకు ఆయనకు సహజంగానే మనసు క్షోభించింది. విపక్షాలు ఎపుడు అవకాశం దొరుకుతుందా అని కాసుక్కూర్చుంటారు. మరి అస్మదీయులు తప్పయినా, ఒప్పయినా మాటల మంత్రాలు వెయ్యగలగాలి. జాతీయ ఛానళ్ల కోసం ఇంగ్లీషు, హిందీ రావాలిగా. చెప్పేది చెప్పుతూ ‘‘నేనేం చెప్పుతున్నానంటే’’ అని అంటుంటే వచ్చే నవ్వు ఆపుకోవాల్సి వస్తుంది. నెహ్రూగారు ఇందిరమ్మకు నువ్వు ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు ఇంగ్లీషులోనే ఆలోచించి మాట్లాడు అని చెప్పేవారు. అంతెందుకు ప్రధాని పదవిపై దృష్టిసారించిన ఎన్.టి.ఆర్, జాతీయ భాష హిందీ ప్రాముఖ్యత గుర్తించినందునే పట్టుదలగా, స్వల్ఫకాలంలోనే నేర్చేసుకుని మైకు ముందు మాట్లాడగలిగేరు. తమ్ముళ్లూ కొంచెం బుర్రవాడండి.