ఒక పెద్ద మనిషి తన రాష్ట్ర పురోభివృద్ధికై విపక్షాన్ని విడిచి అధికార పార్టీలో చేరి అందల మెక్కేడు. మరి తన పుట్టింటితో తెగ తెంపులు కాకుండా అలా చేయడం తప్పుకాదా అని మరో టీమ్... పేర్లు వద్దుగానీ, ముద్దుగా గురువిందలు అని పిలుచుకుందాం, సౌలభ్యంగా ఉంటుంది. సరే ఇక ఈ గురివిందలన్నీ కలిసి రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన గురు గోవిందతో మొరపెట్టుకున్నాయి. రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చెయ్యడం లేదు తమరు అని ముఖం మీదే అనేయగానే, తన అనుభవాన్ని రంగరించి... పిల్ల గురివిందల్లారా! నేను రాజ్యాంగానికి బద్ధుడనయ్యే ఉన్నాసుమీ అని కుండబద్దలు గొట్టేరు. స.హ. చట్టరీత్యా వాకబు చేయగా సదరు పెద్దమనిషి రాజీనామా స్పీకరుకు అందలేదుగాక అందలేదనిన్నీ, దేర్ ఫోర్ బర్తరఫ్ చేసి మంత్రి పదవి పీకేయాలని ధర్నాల వరకూ పోయేరు. దీనికి ఆయన తన వాణిజ్య శాఖ పన్నులు 164 కోట్ల పెరిగి బంగారు బాటలో పరిగెడుతున్నాం, ఓర్చలేక కుళ్లుకుంటున్నారు. దమ్ముంటే నాపై పోటీచెయ్యండి అన్నారు. అంతటితో ఆగకుండా మి గురివింద వేషాలు నా దగ్గర కుదరవు, నేను చట్టాన్ని గౌరవించే సన్మార్గుడిని అయినందున మీరు బ్రతికిపోతున్నారు. ఓ నాలుగు రోజులు ప్రభుత్వం లేదు, ఫర్ సపోజ్ లేదనుకుని వదిలేస్తే తోలు తీసేస్తా అని శాంతంగానే చెప్పేరు. ఒకప్పుడు మనం అందరం సాటి గురివిందలం కావునా, ఆ యొక్క నలుపురంగు ఎక్కడుందో ఒకరిది ఒకరు పరిశీలించుకోలేదా, కనుక ఓవర్ యాక్షన్ చాలు అని ఊరుకున్నారు. మరో విపక్ష గురివింద చాలా తెలివిగా దేవ రహస్యం ఒకటి బయటపెట్టేరు. ఆ పెద్ద మనిషి రాజీనామా చేస్తే ఆమోదించడానికి నాకేం నొప్పా అన్నారట స్పీకరుగారు అని. ఒక ప్రక్క ఆయన రాజీనామా కాపీని జోబీలో పెట్టుకు తిరుగుతున్నారంటారు. ఏది నిజం దొరా? గురివిందల పృష్ఠ భాగంలో ధవళ వర్గం గల వారెవరో!