శాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపే ప్రయత్నం ఊపందుకుంది. ప్రత్యేక రాయలసీమ సాధన పేరిట ప్రాంతీయ ఉద్యమానికి రంగం సిద్దమైంది. సీనియర్ సీమ నేత, వైకాపా లీడర్ మైసూరారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రమే కాంగ్రెస్, వైసీపీకి చెందిన నేతలంతా ఆయన ఇంట్లో భేటీ అయ్యారు. శ్రీకాంత్‌రెడ్డి, శైలజానాథ్, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. అంతేకాదు 20న వైకాపాకు మైసురా రెడ్డి రాజీనామా చేయటంతోపాటు 21న పార్టీని ప్రారంభించనున్నారట. కేవలం వైకాపా, కాంగ్రెస్ నుంచే కాదు పాత పార్టీ టీడీపీ నుంచి కూడా పలువురికి గాలం వేస్తున్నారట.
ఇక ఈ ఉద్యమంపై లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ స్పందించారు. సీమ ప్రాంతంకోసం ఇటీవల పలువురు రాజకీయ నేతలు చేస్తున్న ఉద్యమం, ధర్నాలను జేపీ తప్పుబట్టారు. కేవలం రాజకీయ అవసరాల కోసమే సీమ ఉద్యమాన్ని రాజకీయ నేతలు చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ కోసం చిత్తశుద్ధితో ఎవరూ పనిచేయడం లేదని ఆరోపించారు. ఇలాంటి సమయంలో మేధావులంతా కూర్చుని సమస్యలపై చర్చించుకోవాలని సూచించారు. ఈ మేరకు అనంతపురంలో మీడియాతో మాట్లాడిన జేపీ, దోపిడీదారి ప్రభుత్వాలపై యువత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలుపుకుని ఏడు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పోరాడాలని ఈ సమితి నిర్ణయించగా దానిని జేపీ తప్పుబట్టారు. ఆయా ప్రాంతాలు ఇండస్ట్రీయల్ కారిడార్ తో అభివృద్ధి చెందాయని జేపీ తెలిపారు.
మరో వైపు ఈ ఉద్యమం వెనుక జగన్ హస్తముందని వార్తలు వినవస్తున్నాయి. 1999 లో రాజశేఖర్ రెడ్డి అనుసరించిన విధానమే ఇప్పడు జగన్ కూడా చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఆ టైంలో చెన్నారెడ్డి ని ఉసిగొల్పి తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తిన రాజశేఖర్ రెడ్డి తర్వాత టీడీపీ ప్రభుత్వం పతనమయ్యేందుకు కారణమయ్యారు. ఇప్పుడు జగన్ కూడా మైసూరాను ఉసిగొల్పి అదే పని చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.