అధికార మదంతో ఓ మహిళా మంత్రి, ఆమె అనుచరులు చేసిన తప్పుకి సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. హెచనీయమైన ఆమె చర్యకు ఏకంగా రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి . విషయంలోకి వస్తే... మధ్యప్రదేశ్ మంత్రి కుసుమ్ మొహద్లే నవంబర్ 1న మధ్యప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గం పన్నాలో పలు కార్యక్రమాలు చేపట్టారు. పనిలో పనిగా సమీపంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆమె స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. రోడ్లు ఊడుస్తున్న సమయంలో ఓ పిల్లాడు అడుక్కుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. ఓ రూపాయి దానం చేయాల్సిందిగా ఆమెను బతిమాలాడాడు. దీంతో ఆమె ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. అంతే సైగలతో సిబ్బందిని ఆదేశించింది. వారంతా కలిసి ఆ పిల్లాడ్ని చితకబాదారు. ఆ సందర్భంలో ఆవిడగారు తన కాలితో తలపై తన్నారు.
ఈ మొత్తం ఘటన వీడియోను ఓ ప్రముఖ చానెల్ ప్రసారం చెయ్యటంతో దేశమంతా ఆమె చర్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఘటన చోటుచేసుకున్న సమయంలో అక్కడ జిల్లా కలెక్టర, ఎస్పీ, బీఎస్పీ నేతలు, మీడియా ప్రతినిధులు ఉన్నారుట. అయినా ఎవరూ కూడా ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదట. 72 ఏళ్ల వయస్సున్న ఆ మహిళా మంత్రి గారి నిర్వాకంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా విరుచుకుపడుతుంది. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వయసురీత్యా అంత పెద్దావిడ విచక్షణ మరిచి ఇలా ప్రవర్తించటం నిజంగా దారుణమని తోటి నేతలు సైతం ఆమె చర్యను ఖండిస్తున్నారు. మోదీ చెప్పిన మంచి రోజులు(అచ్చె దిన్) ఇవేనా అంటూ విపక్షాలన్నీ ప్రశ్నిస్తున్నాయి.