పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పై హక్కు, సమయం ఉన్నప్పటికీ అక్కడి పరిస్థితుల దృష్ట్యా లైట్ తీస్కున్నారు. పాలనా సౌలభ్యం పేరిట నవ్యాంధ్ర ప్రాంతం సమీపంలోనే ఆఘమేఘాల మీద ఇళ్లు కట్టేసుకుని సెటిల్ అయిపోయారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి సమీపంలోనే ఉంటే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండొచ్చనేది ఆయన ఆలోచన. అయితే సీఎం ఇంటికే పెద్ద ప్రమాదం వచ్చి పడింది. అనుమతులు లేవంటూ ఆ ఇంటిని కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి. సీఆర్డీఊ కమిషనర్ చేసిన ఓ ప్రకటనే ఇందుకు కారణం కావటం విశేషం.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి గ్రామాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తామని కమిషనర్ తాజాగా ఓ ప్రకటన చేశారు. దీనిపై వైకాపా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే శనివారం స్పందించారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ స్థిరపడిన వారిని అక్రమ కట్టాడాల పేరుతో రోడ్డుపాలు చేయటం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తరపున ఉద్యమించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమే అని అంటున్నారు. ముందు దాన్ని కూల్చివేయండని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నివాసంతో పాటు కరకట్ట మీద బడా బడాబాబులు ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలే అని ఆరోపించారు. రాజధాని కోసం భూములు ఇవ్వక ముందు ఒక మాట, భూములు ఇచ్చిన తర్వాత మరోమాటను చంద్రబాబు మాట్లాడుతున్నారని అంటున్నారాయన. మరో వైపు అధికారులు మాత్రం పక్కా అనుమతులతోనే బాబు ఇంటిని నిర్మించుకున్నారని చెప్పటం విశేషం.