తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత కార్యదక్షుడో మనందరికీ తెలిసిన విషయమే. మంత్రివర్గంలో సామర్థ్యం లేని వ్యక్తులు ఉన్నప్పటికీ తన ఫ్లస్ ద్వారా ఆ మైనస్ లను కవర్ చేస్తూ వస్తున్నారాయన. నిర్దేశించుకున్న పనిని ముగించేందుకు ఆయన ఎంతదాకా అయినా వెళతారనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. 14 ఏళ్ల పాటు ఏకబిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన ఆయన ఎట్టకేలకు తన లక్ష్యాన్ని సాధించుకున్నారు. అది మెచ్చే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. మరి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాల్సిందే కదా. ప్రస్తుతం కేసీఆర్ అదే పని చేస్తున్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో పనులు నత్త నడకలు సాగుతున్న వైనం తెలిసిందే. దీనిపై ఆయన దృష్టిసారించారు. కొత్త రాష్ట్రంలో పనుల సాగదీత ఇకపై కుదరదని కేసీఆర్ అధికారులకు, ముఖ్యంగా కాంట్రాక్టర్లకు తేల్చిచెప్పారు. గతంలోలాగా పనులను నిర్దేశిత కాలంలో పూర్తి చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు నిన్న సాగునీటి శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన ఆయన, నిధుల్లో కోత పెట్టాలని నిర్ణయించారు. అయితే నిర్దేశిత సమయంలోనే పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒప్పంద పత్రంలో పేర్కొన్న సమయంలోగానే పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు సదరు పని విలువలో 1 శాతం మొత్తాన్ని ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కాంట్రాక్టర్ల మెడలు వంచైనా సరే అధికారులు దగ్గరుండి మరీ ఆయా పనులను సకాలంలో పూర్తి చేయాలని అల్టిమేటం జారీ చేశారట.