ఎట్టకేలకు బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ ఓ మెట్టు దిగారు. సీఎం పీఠం దిగేది లేదని ఆదివారం అర్థరాత్రి దాకా బెట్టు చేసిన ఆయన కాస్త తగ్గారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి చేపడితే తనకెలాంటి అభ్యంతరం లేదని, అయితే డిప్యూటీ సీఎం పదవి మాత్రం తనకే ఇవ్వాలని ఆయన సరికొత్త ప్రతిపాదనను సోమవారం జేడీ(యూ) ముందు పెట్టారని సమాచారం. పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే విశ్వాస పరీక్షలో తన బలమేంటో నిరూపిస్తానని బెట్టు చేసిన ఆయన సడన్ గా ఇలా మాటమార్చటం కాస్త విడ్డూరంగా ఉంది. జేడీ(యూ)శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన నితీశ్‌కుమార్ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తూ సోమవారం గవర్నర్‌నను కలిసే సమయంలో, మాంఝీ మాటమార్చడం వెనుక కారణాలు ఏమిటనదేది తెలియాల్సి ఉంది. నితీశ్‌కు మద్దతుగా శనివారం 20మంది మంత్రులు ఇచ్చిన రాజీనామా లేఖలను గవర్నర్ ఆమోదించారు. దీంతో దీంతో ఇప్పుడు గవర్నర్ నితీశ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా? మాంఝీకి బలనిరూపణ అవకాశమిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే మాంఝీ తాజా ప్రతిపాదనతో రాజకీయ సంక్షోభం ముగిసినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ఈ వార్తల్లో ఎంత నిజముందో మరి కొద్ది గంటల్లోనే తెలియనుంది.