బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహార శైలిపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆయన ప్రస్తుతం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు బీహార్ లోనే కాదు యావత్ దేశం మొత్తం మీద తీవ్ర చర్చకు దారితీసింది. అదేంటంటే... జితన్ రాం మాంఝీ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో పాట్నాలోని 1 అన్నే మార్గ్ లోని భవంతిలో అధికారికంగా నివాసంలో ఉన్నారు. పదవి నుంచి దిగిపోయాక కూడా ఆయన ఆ బిల్డింగ్ ను ఖాళీ చేయలేదు. ఆ భవనం ప్రాంగణంలో ఎన్నో మామిడి చెట్లు ఉన్నాయి. పైగా ఈ సీజన్లో అవి మంచి దిగుబడిని ఇచ్చాయి. ఈ మామిడి కాయలు ఎంతో రుచిగా ఉండటంతో నేతలు కూడా తమకు మామిడి కాయలు కావాలని మాంఝీని కొరుతున్నారట. దీంతో మాంఝీ అండ్ కో ఎక్కడ కాయలు కోసేస్తారని ముందు జాగ్రత్తగా 8 మంది ఎస్ఐలు, 16 మంది కానిస్టేబుళ్లు ఆ చెట్టుకు కాపలా కాస్తున్నరని తెలుస్తోంది. దీనిపై మాంఝీ నేతృత్వంలోని కొత్త పార్టీ హిందుస్థానీ అవ్వామ్ మోర్చా తీవ్ర నిరసనలు తెలిపింది. ఓ దళిత నేతను నితీష్ ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తుందని వ్యాఖ్యానించగా, తన ఇంటికి నిత్యం ఎంతో మంది పేదలు వస్తుంటారని, వారికి కనీసం మామిడి కాయలు తినే అర్హత కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుందని మాంఝీ ఆరోపిస్తున్నారు.