టైం బ్యాడయితే పరాయి వాళ్లు కాదు... పక్కన ఉండేవాళ్ల నోటి నుంచి కూడా పంచులు పడతాయంటే ఇదేనేమో. ఢిల్లీ భారీ ఘోర ఓటమిపై బీజేపీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. అవకాశం ఎదురుచూస్తున్న ప్రత్యర్థి పార్టీలతో పాటు దాని మిత్రపక్షాలు కూడా ప్రధాని మోదీపై నిప్పులు చెరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై కొన్ని మనోగతలు ఇప్పుడు చూద్దాం... ముందుగా మిత్ర పక్షం అయిన శివసేన ‘‘బీజేపీ ఓటమి ప్రధాని మోదీ ఓటమి. దేశమంతా మోదీ గాలి వీస్తోందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ గాలికంటే ఢిల్లీలోని సునామీ శక్తిమంతమని అక్కడి ప్రజలు నిరూపించారు’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే అంటున్నారు. ‘‘ఈ రోజు అహంకారం, రాజకీయ ప్రతీకారం ఓడిపోయాయి. బీజేపీ బెలూన్ పగిలిపోయింది’’ అని త్రుణముల్ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇక మత సంబంధిత ‘‘లవ్ జీహాద్, ఘర్ వాపసీవంటి వాటివల్లే హస్తినలో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇక ఇదే అదనుగా భావిస్తున్న జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ ‘‘ఫలితాలు మోదీ పనితీరుకు కొలమానం. దేశంలోని అన్ని ప్రాంతాల వారూ నివసించే ఢిల్లీలో బీజేపీ ఓటమి.. దేశ మనోగతానికి ప్రతిబింబం’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఫలితాలు దానికి నిదర్శం’ అని పీఎంకే చీఫ్ రాందాస్ అన్నారు. ఇక ఆర్ ఎస్సెస్ నేత ఎంజీ వైద్య దీనిని ‘‘ఆప్ గెలుపుకాదు బీజేపీవ్యతిరేకవాదుల గెలుపు’ అని అభివర్ణించారు. దేశమంతా మోదీ గాలి వీస్తుందని ఒప్పుకునే మిత్రపక్షాలు సైతం ఇప్పడిలా విమర్శలు కురిపించటం బీజేపీ కి మింగుడు పడటం లేదు. అంతే ఓడితే ఒకలా... గెలిస్తే మరొకలా...