కొద్దిరోజుల క్రితం మత ఛాందసవాదుల చేష్టలతో ఉత్తరాది వణికిపోయింది. యూపీలోని దాద్రిలో గోమాంసం తిన్నాడన్నా ఆరోపణలతో అఖ్లాక్ అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు కొంతమంది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు విపక్షాలు అన్నీ కలిసి మోదీ సర్కారుపై విమర్శలను కురిపించాయి. ఆరోపణలపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా సంచలన ప్రకటనలు చేశారు. కానీ, ప్రధాని మాత్రం నోరు విప్పిన దాఖలా లేదు. ఖండిస్తున్నా అని ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో చెప్పటం మినహా ప్రధాని చేసిందేమీ లేదని, దానిపై సమగ్ర వివరణ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.
కానీ ఫలితం శూన్యం. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఆ అంశంపై మోదీ మాత్రం పెదవి విప్పటం లేదు. అయితే మోదీ మౌనం వెనుక ఉన్న కారణాన్ని చెబుతున్నారు బీజేపీ మాజీ నేత, ప్రముఖ జర్నలిస్ట్ అరుణ్ శౌరీ.
ఢిల్లీలో ఓ ప్రముఖ మాగ్జైన్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఆ విషయంపై నోరు విప్పితే బీహార్ ఎన్నికల్లో ఓటమిపాలు అవుతామన్న భయంతోనే మోదీ నోరు విప్పటం లేదన్నారు. దేశం మొత్తం అల్లకల్లోలం సృష్టించటమే మోదీ లక్ష్యమని ఆరోపించారు. ఈ సందర్భంగా దాద్రి లాంటి ఘటనలపై నిరసనలు వ్యక్తం చేసిన రచయితలను శౌరీ ప్రత్యేకంగా కీర్తించారు. గతంలో బీజేపీకి ముఖ్యంగా మోదీకి అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. అయితే దాద్రి ఘటనపై శౌరీ మోదీపై విమర్శలు చేసి పార్టీకి దూరమయ్యారు.