కాపులంతా లంచ్ మానేయాలంటున్నాడు

February 05, 2016 | 10:48 AM | 2 Views
ప్రింట్ కామెంట్
mudragada-padmanabham-fast-niharonline

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీసమేతంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటినే ఆయన దీక్షకు వేదికగా ఎంచుకున్నారు. తునిలో నిర్వహించిన ‘కాపు ఐక్య గర్జన’ హింసాత్మకంగా మారడంతో తాను చేపట్టనున్న ఆమరణ దీక్షకు సంఘీభావంగా ఏ ఒక్కరు కూడా కిర్లంపూడి రావద్దని ఆయన కాపులకు సూచించారు.

                    అయితే తన దీక్షకు మద్దతుగా కాపులు వినూత్న ఆందోళనకు దిగాలని ఆయన సూచించారు. తన దీక్షకు మద్దతుగా మధ్యాహ్నం భోజనం మానాలని సూచించిన ఆయన, ప్లేటుపై గరిటెతో కొట్టి నిరసన తెలపాలని వినూత్న రీతిలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు ఏపీలోని కాపుల ఇళ్లల్లో ప్లేట్లపై గరిటెలు నాట్యం చేయనున్నాయి. ఇక ముద్రగడ నివాసం, పరిసర ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమరణ దీక్ష చేపట్టగానే ఇంటి గేట్లు మూసివేశారు. నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాపు నేతలు, సందర్శకులను లోపలికి వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. అయినప్పటికీ వారు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, వారికి వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ పోలీసులు ససేమిరా అన్నారు.

మరోవైపు ముద్రగడ దంపతులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అంతకుముందు దీక్షాస్థలం, పరిరాలను పరీశీలించిన జిల్లా ఎస్పీ రవిప్రకాశ్, జిల్లా అంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. దీక్షా శిబిరానికి ఎవరూ రావొద్దని ముద్రగడ చెప్పారని ఎస్పీ తెలిపారు. శాంతియుతంగా నిరసనలు చేయవచ్చని, అల్లర్లకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ