తెలంగాణ రాజకీయ నేత నాగం జనార్దన్ రెడ్డి వ్యవహార శైలి ఎవరికీ ఎప్పటికీ అంతుబట్టదు. ఉద్యమం ఊపులోనే ఉన్న దశలో టీడీపీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర వ్యవహారించిన వారిలో ఆయన ప్రముఖుడు. కానీ, ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో మారు మాట్లాడకుండా ఉండటంతో ఆయన పై విమర్శలు వెలువెత్తాయి. అదే ఊపులో ఉస్మానియా క్యాంపస్ ను సందర్శించిన ఆయనకు అక్కడి విద్యార్థుల హస్తవాసి మూలంగా జ్ఞానోదయం అయ్యింది. దీంతో కళ్లు తెరిచిన ఆయన ఉద్యమంలో ఒక్కసారిగా లేచారు. పాలమూరు నుంచి పోరాటం బాగానే చేశారు. విభజన విషయంలో చంద్రబాబుకి క్లారిటీ లేదనే సాకుతో కాషాయం కండువా కప్పుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కమలానికి కీలక నేతగా వ్యవహరించారు.
అయితే ఆయన పరిస్థితి ఏం బాగోలేదు. టీడీపీ నుంచి బయటకి వచ్చిన తర్వాత నాగంకు పాపులారిటీ లేకుండాపోయింది. దీంతో డైలమాలో పడ్డ ఆయన బచావో తెలంగాణ మిషన్ పేరిట్ ఏకంగా ఓ పార్టీని స్థాపించి పారేశారు. మళ్లీ తన స్థాయిని నిలబెట్టుకోవాలంటే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని ఆయన నిర్ణయించుకున్నట్లు ఉన్నారు. అయితే పార్టీ పెట్టినాయన పనిచేసుకుంటూ పోవాలి గానీ అధికార పక్షాన్ని కెలకటం ఇప్పుడు చర్చగా మారింది. ఏకంగా ముఖ్యమంత్రి పైనే ఆయన విరుచుకుపడ్డారు. కేసీఆర్ చీప్ లిక్కర్ ఆలోచన మరీ చీప్ గా ఉందని, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసే విధంగా ఆయన చేష్టలు ఉన్నాయని ఆరోపించారు. అసలు బచావో తెలంగాణ మిషన్ లక్ష్యం టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాధించేందకేనని ఆయన స్పష్టం చేశారు.
ఇక ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు వినయ్ భాస్కర్, కర్నె ప్రభాకర్ లు కాస్త ఘాటుగా స్పందించారు. పార్టీ పెట్టుకుంటే పెట్టుకున్నావ్ గానీ మా అధినేతపై విమర్శులు ఎందుకు చేస్తున్నావంటూ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే నాగం ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతకీ ఈ పార్టీ తెలుగుదేశం దా లేక బీజేపీ దా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ భవితవ్యం ఏమైపోద్దోనన్న టెన్షన్ లో అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. గతంలో ఇలాగే పార్టీ పెట్టిన దేవేందర్ గౌడ్ పరిస్థితి ఏంటో ఇప్పుడు అందరికీ తెలుసు. మరి హైలెట్ అవ్వడానికి మరీ అంత నోటి జారాలా నాగంగారు?