నవ్యాంధ్ర రాజధాని విషయంలో నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వంపై సీరియస్ అవుతూనే ఉన్నారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా భూములు లాక్కొవడం సరికాదంటూ మొదటి నుంచి ఆయనను ఆ చర్యను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. గత వారం రోజులుగా ప్రభుత్వం ఆయన ట్వీట్లతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా బుధవారం కూడా ఆయన మరోమారు ట్వీటాడు. ‘అభివృద్ధి పేరుతో తక్కువ నష్టం చేసేవారే వివేకవంతమైన పాలకులవుతారని కూడా ఏపీ ప్రభుత్వానికి పంచ్ విసిరారు. అలాగే తాను బలవంతపు భూసేకరణ వ్యతిరికస్తున్నానని కుండబద్దలు కొట్టేశారు’. గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారిని బహుళ పంటలు పండుతున్న సారవంతమైన భూములున్న ఉండవల్లి, పెనుమాక, బేతపూడి తదితర గ్రామాల్లో భూసేకరణ ప్రయోగించవద్దని అభ్యర్థిస్తున్నాను అని పేర్కొన్నారు. ఏ దేశమైన, పాలకులు ఎవరైనా ఒక చోట అభివృద్ధి జరుగుతోందంటే దాని కోసం కొంత కాలుష్యం, కొంతమంది ప్రజల ఆక్రోశం, కొంతమంది జీవనాధారం కోల్పోవటం జరుగుతుంది. ఇది నాగరికతకి మనం చెల్లించాల్సిన మూల్యం. అందుకే తక్కువ నష్టంతో అభివృద్ధి సాధించటం లోనే నాయకుల వివేకం, అనుభవం తెలుస్తాయి అంటూ పంచ్ లు వేశాడు.
అయితే ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే ఏపీ ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. రాజధానిలో ఇప్పటికే వేలాది ఎకరాల భూసేకరణ జరిగిందని...చాలా తక్కువ గ్రామాల రైతులు మాత్రమే భూసేకరణ వ్యతిరేకిస్తున్నందున ఏం చేయాలనేదానిపై తాము చర్చిస్తున్నట్టు చెప్పారు. భూసేకరణ చట్టం ద్వారా భూములు సేకరించవద్దని చెపుతున్న పవన్ ఎలాంటి భూములు సేకరించాలో కూడా చెపితే మంచిదన్నారు. ఇక బీహార్ ప్యాకేజీ ని ఏపీతో పోల్చడం సరికాదన్నారు. ఏపీ రెవెన్యూ లోటును మొత్తం కేంద్రమే భర్తీ చేయాలన, .అలాగే 25 లక్షల కోట్ల తో కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించామని యనమల తెలిపారు. ఇక ప్రత్యేక హోదా కేంద్రం పార్లమెంటులో ఇచ్చిన హామీయే అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మొత్తానికి భూసేకరణ వ్యవహారం జనసేన, టీడీపీల మైత్రికి పెద్ద దెబ్బ కొట్టేలా ఉంది.