ఆనం బ్రదర్స్ ఆఫ్టర్ లాంగ్ టైం

November 26, 2015 | 11:06 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Anam-brothers-to-join-TDP-niharonline

నెల్లూరు రాజకీయాల్లో పేరొందిన కీలక నేతలు ఆనం బ్రదర్స్. ఒకరు (సీనియర్ ఆనం) వివాదాస్పద ప్రకటనలకు, ముక్కుసూటిగా మాట్లాడేతత్వం ఉన్న వ్యక్తి అయితే, మరోకరు (ఆనం రాంనారాయణరెడ్డి) సైలెంట్ గా పనులు చేసుకుంటూపోయే వ్యక్తి. స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు దేశం పార్టీని ఆవిష్కరించిన టైంలో మారు మాట్లాడకుండా వీరిద్దరు ఆ పార్టీలో వీరు చేరిపోయారు. ఏం జరిగిందో తెలీదు కొన్నాళ్లకే గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లోకి జంప్ అయిపోయారు. ఇక అప్పటి నుంచి దాదాపు పాతికేళ్లపాటు అందులోనే ఉంటూ టీడీపీని, ఆయా పార్టీ నేతలను సందు దొరికినప్పుడల్లా వాయిస్తూ వస్తున్నారు.

వీరిలో జూనియర్ ఆనం దివంగత నేత వైఎస్ సీఎంగా ఉన్న టైంలో కేబినెట్ లో కీలక భూమిక పోషించారు. ఆపై రోశయ్య కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత నల్లారి కిరణ్ కేబినెట్ లోనూ అదే పదవిలో కొనసాగారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోగా, ఆ గాలికి ఆనం బ్రదర్స్ కు కూడా ఓటమి తప్పలేదు. దీంతో పార్టీ కార్యక్రమాలకు గత కొంత కాలంగా వీరిద్దరు దూరమైపోయారు. ఇటీవల ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చేపట్టిన మట్టి సత్యాగ్రహంపై అంతెత్తున ఎగిరిపడ్డ రాంనారాయణ రెడ్డి, నమ్ముకున్న పార్టీ తమ నెత్తిన మట్టి వేసిందని ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వారు కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని నాడే ప్రచారం జరిగింది. తెర వెనుక జరిగిన భారీ తతంగంలో తొలుత వైసీపీలోకి వెళ్లాలన్న వారి యత్నాలు ఫలించలేదని సమాచారం. అప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి కుటుంబం వైసీపీలో కీలక స్థానంలో ఉంది. అంతేకాక రాజకీయ ప్రత్యర్థి నల్లపురెడ్డి కూడా ఆ పార్టీలో ఉండటంతో అందులో చేరే మార్గం కనిపించలేదు. ఈ క్రమంలో టీడీపీ వైపు వారి చూపుపడింది.

తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకోవటం,  నెల్లూరులో పార్టీ పటిష్టత కోసం వీరి చేరికకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా అంగీకరించడంతో సైకిల్ ఎక్కేందుకు వీరిద్దరూ సిద్ధమైపోతున్నారు. అంతేకాదు పార్టీ మారకముందే వారికిచ్చే పార్టీ పదవులను కూడా ఖరారు చేశారని సమాచారం. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ చార్జీ బాధ్యతలు జూనియర్ ఆనంకు, నెల్లూరు రూరల్ ఇన్ చార్జీ బాధ్యతలు సీనియర్ ఆనం కొడుకుకు దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు డిసెంబర్ 5న వీరిద్దరి అధికారికంగా టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ