బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి జితన్ రాం మాంఝీ స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయటంతో హైడ్రామాకు తెరపడింది. దీంతో మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న జేడీ(యూ) సీనియర్ నేత నితీశ్ కుమార్ కోరిక నెరవేరనుంది. నాటకీయ పరిణామాల మధ్య విశ్వాస పరీక్ష జరగాల్సిన నేపథ్యంలో శుక్రవారం ఉదయమే మాంఝీ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో పూర్తిస్థాయి బలం ఉన్న నితీశ్ ప్రభుత్వం ఏర్పరిచేందుకు అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ... రాజీనామా చేసి తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాను తిరిగి క్రియాశీలక పాత్ర పోషించేందుకు వస్తున్నానని చెప్పాడు. ప్రజలంతా పెద్దమనస్సుతో తనను మన్నించాలని చేతులెత్తి కోరాడు. ఈనెల 22 న ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం ఇది ఆయనకు నాల్గవసారి.