మహాకూటమిలో జేడీయు తరువాత అత్యధిక స్థానాల్లో గెలిచిన ఆర్జేడీ పార్టీ నేత లాలు డిమాండ్ మేరకు ఇష్టం లేకపోయినా తేజస్వి యాదవ్(లాలూ కుమారుడు) ని ఉపముఖ్యమంత్రిగా నియమించాడు నితీశ్ కుమార్. రాజకీయాల్లో అస్సలు అనుభవం లేని తేజస్వికి ఆ పదవి కట్టబెట్టడంపై విమర్శలు తారాస్థాయిలోనే వెల్లువెత్తాయి. అయితే ప్రజలు అత్యధిక ఓట్లు వేసి గెలిపించిన తనకు ఉపముఖ్యమంత్రి పదవిని ఎందుకు ఇవ్వకూడదని గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు అతగాడు. ఓ పుస్తకం కవర్ పేజి చూసి అది ఎటువంటి పుస్తకమో నిర్ణయించకూడదంటూ లాజిక్ లు కూడా మాట్లడి ఆకట్టుకున్నాడు. రాజకీయాల్లో అనుభవం లేకపోయినా వారసత్వంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఇక ఇప్పుడు అది ఆచరణలోకి పెట్టేస్తున్నాడు.
తమిళనాడు పరిస్థితి ప్రస్తుతం వరదలతో ఎంత దారుణంగా ఉందో తెలిసిన విషయమే. ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో ఆ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు తేజస్వియాదవ్ ముందుకొచ్చారు. వరద సాయంగా తన మొదటి నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మన కనీస ధర్మం అని తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. మానవతాదృక్పథంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ ట్వీట్ లో తేజస్వి తెలిపారు. ఇక తేజస్వి మానవతావాద నిర్ణయంపై తన కొడుకు ఎంతగానో ఎదిగిపోయాడని లాలూ ఫుల్ ఖుషీగా ఉన్నాడట.