భారత్- బంగ్లాదేశ్ ల నాలుగు దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. రెండు దేశాల మధ్య ఉన్న 162 గ్రామాల సరిహద్దులు మారాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని దాదాపు 14 వేల మంది బంగ్లాదేశీయులకు శుక్రవారం భారత పౌరసత్వం లభించనుంది. అంతేకాదు సరిహద్దు గ్రామాలకు కొత్త భారత పిన్ కోడ్ సంఖ్యలు రానున్నాయి. వీరందరి ఊళ్లలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్వహణలో రేషన్ దుకాణాలు వెలుస్తాయి. అందరికీ మిగిలిన భారతీయుల తరహా అన్ని రకాల సేవలు వీరికి దగ్గరవుతాయి. ఉద్యోగాలకు పోటీ పడేందుకు యువత అర్హత పొందుతుంది. దీంతో ఆయా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా భారత త్రివర్ణ జెండాలు రెపరెపలాడుతు కనిపిస్తున్నాయి. మే లో భూ సరిహద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో ఇరు దేశాల ప్రధానులు ఒప్పందాలపై సంతకాలు చెయ్యటంతో నలభై ఏళ్లుగా నలుగుతున్న ఈ జఠిల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్లయ్యింది.
ఇక ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశీయులు అధికంగా ఉన్న ప్రాంతాలు ఆ దేశంలోకి వెళ్లగా, భారతీయ మూలాలు కలిగివున్న ప్రాంతాలు ఇండియా పరిధిలోకి వచ్చాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది వరకూ ప్రజలున్నారు. వీరిలో 14 వేల మంది ఉన్న ప్రాంతాలకు నేడు పిన్ కోడ్ సంఖ్యలను అందించనున్నట్టు కూచ్ బెహర్ కలెక్టర్ ఉళగనాథన్ వెల్లడించారు. నేటి నుంచి 2016 జూన్ 30 లోపు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు వారి సంక్షేమం కోసం కేంద్రం దాదాపు రూ.3,048 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందన్నారు.