కర్మయోగి కలాం మహాభినిష్క్రమణంపట్ల భరతమాత మౌనంగా రోదించడం మానవ జన్మ ఎత్తిన వారందరికీ దృగ్గోచరమవుతూనే ఉంది. వేదనా భరితమైన మూలుగు వినిపిస్తూనే ఉంది. ఇది ఈ గడ్డపై నెలకొన్న విషాదవాతావరణం.
షిల్లాంగులో ఉపన్యసిస్తూ మహానుభావుడు తుదిశ్వాస విడవడం జరిగింది. ఈ సంఘటన నెలకొన్న పట్టణం కూతవేటు దూరంలోనే అస్సాం అనే మరో రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తరుణ్ గొగోయ్ పేరు ధరించిన పెద్దమనిషి ఉన్నాడు. గొగోయ్, దేశమంతా గొల్లు మంటుంటే ఒకానోక కార్యక్రమంలో పాల్గొని యువతుల భుజాల మీద వీరి బాహువులానించి వచ్చిరానీ నాట్యప్రదర్శనతో నవ్వులపాలవటం సదరు దృశ్యాలు విజువల్ మీడియా ద్వారా మన అందరికీ అందుబాటులోకి రావటం జరిగింది. బావుంది ముఖ్యమంత్రి గొగోయ్ గారూ. వారంపాటు దేశమంతటా సంతాపదినాలు ప్రకటించిన విషయం సారుకి తెలియదా?
ఇక మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనే పేరుగల పెద్దావిడ ఉద్యోగకాలం ముగిసి ప్రస్తుతం పూణేలో సేదతీరుతున్నారు. అంతపెద్ద ఉద్యోగం వెలగబెట్టిన కాంతామణికి సమయం సందర్భం తెలియదా. అందరూ తలపట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఇంటికి పెద్దావిడ కొంగు అందించి తుడిచే ప్రయత్నం చెయ్యాలా మరి. కానీ,ఈ ఇల్లాలు ఇదే ముహుర్తంగా భావించినదై కేంద్రాని తనకు వాహనం కావాలి, దానికింత పెట్రోల్ కావాలి అని, ఒక పక్క కలాం మహాశయుని పార్థివదేహం ఆయన స్వగ్రామం చేరలేదు., కోరిక వెల్లడించడం జరిగింది. ఆడమనసేమైనట్టు?