రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు, ఆరోపణలు సహాజం. ఎదుటివారి అనుభవం, అధికారం, వారి స్తోమత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రాళ్లు వేయాలే తప్ప. ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఎంత పడితే అంత వాగితే ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజాగా వైసీపీ మహిళా నేత, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేయబోతుంది. ఏకంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తద్వారా తెలుగు తమ్ముళ్ల నోటికి పని కల్పించింది.
విశాఖ జిల్లా చింతపల్లిలో గురువారం ప్రతిపక్ష వైకాపా ఆధ్వర్యంలో జగన్ నేతృత్వంలో బాక్సైట్ వ్యతిరేక సభ జరిగింది. ఈ సభలో ఆమె మాట్లాడుతూ బాక్సైట్ జోలికొస్తే చంద్రబాబు తల నరుకుతామని ప్రకటించిన గిడ్డి ఈశ్వరి సభకు హాజరైనవారిని షాక్ కు గురి చేసింది. ఆవేశపూరితంగా ప్రసంగించిన చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకూ దిగింది. బాబును నరరూప రాక్షసుడిగానే కాక వెన్నుపోటుదారుడు, దగాకోరుగానూ అభివర్ణించింది. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసిస్తూ నిషేధిత మావోయిస్టులు ముగ్గురు టీడీపీ గిరిజన నేతలను అపహరించిన ఘటనను ప్రస్తావించిన ఈశ్వరి, పార్టీ జెండా మోసిన గిరిజనులకు కష్టం వస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదని నిందించారు.
ఇక చివరగా బాక్సైట్ తవ్వకాలపై పోరాటానికి మద్దతుగా తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన ఆమె, టీడీపీ అభ్యర్థికి డిపాజిట్ ను కూడా గల్లంతు చేేస్తానని చెప్పారు. ఎన్నికలో టీడీపీ అభ్యర్థికి డిపాజిట్ వస్తే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా, తాను గెలిస్తే బాబు రాజీనామా చేస్తారా అంటూ ఆమె సవాల్ చేశారు. కాగా, విమర్శలు చేసిన సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమె పక్కనే ఉండటం విశేషం.