బీహార్ ఎన్నికల్లో ప్రస్తుతం కుల సమీకరణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వాటిని ఆధారంగానే చేసుకునే అక్కడ గెలుపు ఓటములపై పార్టీలన్నీ లెక్కలు కట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జనతా పరివార్ కూటమి సమీకరణాలు దఫా దఫా పోల్ కి మారిపోతున్నాయి. మొదటి దశ తర్వాత నీరసం వ్యక్తం చేసిన మహా కూటమి ఇప్పుడు హుషారుగా ఉంది. అయితే కుల రాజకీయాల విమర్శలతో విరుచుకుపడుతున్న నేతల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ముందు వరుసలో ఉన్నారు. అలాంటిది ఆయనపైనే కుల వ్యాఖ్యలు చేశారు రాష్ట్రానికి చెందిన మరో యాదవ నేత పప్పూ యాదవ్.
లాలూ ప్రసాద్ యాదవ్ ను 'నకిలీ యాదవ్' అని పేర్కొన్న పప్పు యాదవ్ తానే నిజమైన యాదవుడనని ప్రకటించుకున్నారు. బీహార్ రాజకీయ నేతల్లో అత్యంత నేరపూరిత చరిత్ర కలిగిన పప్పూ యాదవ్ పూర్వాశ్రమంలో ఆర్జేడీ నేతగానే ఉన్నారు. అంతేకాక లాలూ ప్రసాద్ కు అత్యంత సన్నిహితుడిగానూ పేరుగాంచారు. తాజాగా లాలూతో విభేదించిన పప్పూ యాదవ్, ‘జన్ అధికార్ పార్టీ’ పేరిట సొంత కుంపటి పెట్టుకుని బీహార్ అసెంబ్లీ బరిలో దిగారు.
మాధేపురా ఎంపీగా కొనసాగుతున్న పప్పూ యాదవ్, యాదవులు అత్యధికంగా ఉన్న సీమాంచల్ లో మెజారిటీ సీట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రచించారు. ఐదో విడతలో సీమాంచల్ లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఆయన లాలూ ప్రసాద్ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
‘‘లాలూ ప్రసాద్ తనచుట్టూ భజన చేసే వాళ్లను పెట్టుకుంటారు. అంతేకాదు ఒకప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉన్న యాదవ్ లను ఇప్పుడు బహిష్కరించారు. ఆయన దృష్టిలో యాదవ్ లు ఓటు బ్యాంకు మాత్రమే. కానీ నేను మాత్రం యాదవ్ సామాజికవర్గం అభ్యున్నతికి కృషి చేస్తున్నాను’’ అంటూ పప్పూ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.