అమరావతి కోసం భూసేకరణ టైంలో రైతుల పక్షాన నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వ్యక్తి నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆనక ప్రభుత్వం వెనక్కి తగ్గటంతో థాంక్స్ చెబుతూ ట్విట్టర్లో ట్వీట్ లు చేశాడు. రైతుల కష్టాలను అర్థం చేసుకుని బలవంతపు భూసేకరణను నిలిపివేసిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కూడా. అయితే అమరావతి శంకుస్థాపనకు పవన్ గైర్హాజరు కావటం ఫ్యాన్స్ తోపాటు పలువురు నేతలను కూడా బాధపెట్టిన మాట నిజం. సర్దార్ సినిమా షూటింగ్ లో బిజీ ఉంటానని పవన్ ముందే చెప్పినప్పటికీ ఓ మహత్తర కార్యక్రమానికి ఆయన లేకపోవటం నిజంగా పెద్దలోటే.
పలు అంశాలపై, ముఖ్యంగా రాజధాని భూసేకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమనుకుంటే ప్రభుత్వానికి ఎదురెళ్లి పోరాడతానని స్పష్టంగా ప్రకటించారు. అయితే అది నేరుగా కాదులెండి. సోషల్ మీడియా ట్విట్టర్లో. అంతేకాదు ఆపై స్వయానా బేతంపూడికి వెళ్లి ప్రజలను పరామర్శించి మరీ ఆయన వచ్చారు. తనకు ప్రజలే ముఖ్యమని పార్టీలు కాదని రైతుల సాక్షిగా ప్రకటించారు.
ఇక పవన్ దూకుడు చూసే ఏపీ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గిందనటంలో అతిశయోక్తిలేదు. కానీ, పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయలపై సైలెంట్ అయిపోవటం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 28న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన రెండు నెలలు దాటినా మరో వ్యాఖ్యను పోస్ట్ చేయలేదు. ట్విట్టర్ లో కనిపించక సరిగ్గా రెండు నెలలైంది. ఇక తాజాగా భూసేకరణ తప్పదని ఏపీ సర్కారు, అందునా స్వయంగా చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎలా స్పందిస్తారోనని అటు అభిమానులు, ఇటు రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీకి అధికారికంగా ఎన్నికల రిజిస్ట్రేషన్ లభించటంతో ఇక పూర్తి రాజకీయాలకు దిగనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి వీటన్నింటిపై పవన్ కల్యాణ్ నేరుగా కాకపోయినా కనీసం ట్విట్టర్లో అయినా స్పందిస్తే బావుంటుందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.