ఎన్నికల ప్రచార సమయంలో గులాబీ బాస్ కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కాస్త ఘాటుగానే పవన్ పై విరుచుకుపడగా, అదే రేంజ్ లో సెటైర్లు వేశాడు పవన్. అయితే వ్యక్తిగతంగా మాత్రం కేసీఆర్ కి పెద్ద అభిమానినని ప్రకటించుకున్నాడు. రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై స్పందించని పవన్, ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ గురించి, ఆయన పాలన గురించి ప్రస్తావించాడు.
రూలింగ్ పరంగా టీ సీఎం కేసీఆర్ ఓ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని పవన్ వ్యాఖ్యానించాడు. ఆయన ఓ విజన్ తో జాగ్రత్తగా వెళుతున్నారని అన్నారు. ‘‘అయితే ఒక్కోసారి నాకు ఇబ్బందిగా అనిపించేది ఏంటంటే, మిగతా పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకోని పోవడం... నిజంగా అది అంత అవసరం లేదుకదా? అనిపిస్తుంది. నాకు అదొక్కటే చంద్రశేఖరరావు ఆలోచనా విధానంపై అసంతృప్తి. మీరు కలుపుకొని వెళ్లడం... బయట నేను ఎక్కడ వింటున్నాగానీ పాలన బాగుందనే అంటున్నారు. నేను ప్రత్యక్షంగా చూడలేదుగానీ, నాకు తెలిసింది. కాకపోతే, మిగతా అన్ని పార్టీల నుంచి రావడం... అది ఎంతవరకూ అడ్వాంటేజ్ అన్నది నాలో ఆలోచన పుట్టిస్తోంది. ఎందుకంటే... ఉద్యమ స్వరూపంతో వచ్చిన పార్టీ. అలాంటి పార్టీకి కూడా ఇలాంటి విధానాలు అవసరమా? ఈ వేరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకురావడాలు... వినూత్నంగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీకి ఇది అవసరం లేదు. అయితే ఇదంతా పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే" అని పేర్కొన్నాడు.