ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో త్వరలో కీలకమార్పు చోటుచేసుకోనుందా? అవుననే సమాధానం వినిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని కీలకమైన బాధ్యతలను తొలగించబోతున్నారని ఇప్పుడు టాక్ నడుస్తోంది. ఆయన పనితీరుపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేఈ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే కీలకమైన రెవెన్యూ శాఖను సమర్థులకు అప్పగించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
అనుభవజ్ఙుడన్న కారణంతో కేఈ చేతికి ఆ శాఖ అప్పగించినా కొత్త రాష్ట్రంలో కీలకమైన దశలో ఆయన యాక్టివ్ గా పనిచెయ్యటం లేదని చంద్రబాబు భావిస్తున్నారట. ఆ కారణంగానే రెవెన్యూ శాఖకు సంబంధించిన పనులనూ ఇతర మంత్రులతో చేయిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఆ శాఖలో అవినీతి అడ్డగోలుగా జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖలో బదిలీలకు ఉత్తర్వులిస్తే దాని వెనుక పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని తెలుసుకున్న చంద్రబాబు రాత్రికి రాత్రి ఆ జీవోను ఆపించారు. ఇవన్నీ కేఈ చేతి నుంచి రెవెన్యూ శాఖ జారిపోవడానికి కారణమవుతున్నాయి. కీలకమైన పదవి నుంచి తొలగించినా ఉపముఖ్యమంత్రి పదవికి ఢోకా లేదనే సమాచారం.
ఇక కీలకమైన ఈ బాధ్యతకు సీనియర్ల పేరు పరిశీలనలో ఉన్నాయి. ఈ మేరకు రేసులో ఉన్న అనంతపురం కు చెందిన సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కు రెవెన్యూ పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వినవస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి పాలైన పయ్యావులను ఎమ్మెల్సీ చేసే సమయంలో ఆటంకాలేమీ కలగలేదు. దీంతో మంత్రి పదవి కూడా అనుభవజ్నుడైన ఆయనకు మంత్రి పదవి ఇవ్వటంలో కూడా ఎలాంటి అభ్యంతరాలు తలెత్తవని బాబు భావిస్తున్నారట. కేఈ పై ఉన్న వ్యతిరేకత పయ్యావులకు ఇలా కలిసి వస్తోందన్నమాట.