ఈ మధ్య రాజకీయ పంచ్ డైలాగ్ లు త్రివ్రికమ్ సినిమాలోని మాటల కన్నా ఘాటుగా, స్పీడ్ గా పడిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ సర్కార్ పై వాగ్బాణాలు సంధించిన మరుక్షణమే బీజేపీ నేతలు, కేంద్ర మంత్రలు ఆయనపై ఎదురు దాడి ప్రారంభించారు. ఈ క్రమంలోనే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ రంగంలోకి దిగి రాహుల్ ని ఓ రేంజ్ లో అందుకున్నారు. వ్యంగ్యాస్త్రాలతో యువరాజ్ పై పంచ్ లు వేశారు. టీవీల్లో కనిపించేందుకే రాహుల్ గాంధీ తమపై ఆరోపణలు గుప్పిస్తున్నారని జవదేకర్ అనటంతో సీరియస్ గా ప్రారంభమైన పాత్రికేయుల సమావేశం ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించడం, ఆందోళనలు చేయడం కేవలం టీవీల్లో కనిపించేందుకోసమేనని ఆయన వ్యాఖ్యానించారు. గడచిన పదేళ్లుగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ దోపిడీ పాలనపై రాహుల్ గాంధీ సమాధానం చెబితే, ప్రధాని నోరు విప్పుతారని అన్నారు.