రాష్ట్రం విడిపోయేందుకు కారణలేమిటనగానే కర్ణుడులేచి వచ్చి నావిషయంలో వలె ఆరు కారణాలు కాదు అరవై ఉంటాయి అని పద్యం అందుకోగలడు. రాజమండ్రి పార్లమెంటు మెంబరు మాగంటి మురళిమోహన్ విభజన వల్ల తన రాష్ట్రం ఎన్ని అగచాట్లు పడుతుందో పక్కనబెట్టి ప్రత్యేకహోదా ఒకటే సర్వరోగ నివారిణి అని సూత్రీకరించి, ఈ రోగానికి మూలకారణం కాంగ్రెస్ వైరస్సే అని నిర్ధారణ చేశాడు. అదే ఈ నటుడు ఎంఎల్ఏ అయితే, స్వంతానికి రాజధాని లేక, కూర్చునేందుకు అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్ లేకపడుతున్న పాట్లు తెలిసివచ్చును. ఆ నొప్పేమిటో అర్థమవును. హస్తినలో అన్నీ రెడీమేడ్ గా అమరి ఉన్నాయి మరి. అయితే గత జల సేతు బంధం వేస్టుకదా అని మురళిమోహన్ ప్రత్యేక హోదా అంశంపై దృష్టికేంద్రీకరించేడు. రాష్ట్రవిభజన టైంలో ప్రత్యేక హోదా ఊసెత్త లేదనీ కాంగ్రెసు వెలగబెట్టిన ఈ నిర్వాకం వల్లనే తాము పోరాటం చేయాల్సిన అగత్యం ఏర్పడిందనీ చింతిస్తున్నాడు. ఇటీవలకాలంలో కొణిదెల పవన్ కళ్యాణ్ సంబంధిత ఎంపీలందర్నీ ఏకీపారేశాడు. అందులో మహరాజశ్రీ మురళీగారు కూడా ఉన్నారు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో ఫ్రెండ్ షిప్ ఉంది. నిన్ననే వారందరి ముంజేతులకు వీరతాళ్లు కట్టేము. ఆ కారణంగా వారి కుత్తుకులపై కత్తిపెట్టి నిలదీసే సదవకాశం లేదు అని ఢీలా పడిన ప్రకటన చేశాడు. అయినా కొసమెరుపుగా ఒకమాట వాగ్దానం చేశాడు. ఏది ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎంపీలు సంసిద్ధులై ఉన్నారని చెప్పి మనందరికి మనశ్శాంతి ప్రసాదించేరు. అసలీ పీకలపై కత్తేంటి? పోరాటమేంది? ఒత్తిడేంటి? నంగిమాటలు కాబోతే!