ఉద్యమ సమయంలో ఉన్నా... పార్టీ మారినా... తిరిగి సొంత గూటికి చేరినా... ప్రస్తుత రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా ఉన్నా... ఆ ఇద్దరి మధ్య వైరం ఇంత ఓ కొలిక్కి రావటం లేదు. పోనీ ఇద్దరు బద్ధ శత్రువులు అనుకుంటే అదేం కాదు... ఇద్దరు చిన్ననాటి స్నేహితులు, ఒకే స్కూలో కలిసి చదువుకున్నారు. రాజకీయాల్లో కూడా ఓనమాలు ఒకే పార్టీలో దిద్దారు. దశాబ్దం పాటు అదే పార్టీలో కొనసాగారు కూడా. కానీ, వారిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వారే ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్. ఇద్దరు జిగిరి దోస్తులు అయినప్పటికీ రాజకీయ ప్రభావంతో ఒకే పార్టీలో ఉన్నా... వైరం మాత్రం ఓ రేంజ్ లో ఉంది. తాజాగా వరంగల్ ఉపఎన్నికల్లో పోటీచేస్తారా అంటూ మీడియా ఆయన్ను కదిలించగా మళ్లీ కిరణ్ పై కస్సుమన్నారు.
దీనికి కారణం లేకపోలేదు. ఉద్యమ సమయంలో వివేక్ కిరణ్ పై తీవ్ర విమర్శలు చేయడం. ఫైళ్లను కదిలించేందుకు కిరణ్ కుమార్ లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు కూడా. దీనిపై సీరియస్ అయిన కిరణ్ ఆ సమయంలో వివేక్ కంపెనీలపై పడి రివెంజ్ తీర్చుకున్నారు. వీటిపై అప్పట్లో ఇద్దరు బాహాబాహీగానే విమర్శించుకున్నారు. వివేక్ ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో ఉన్న టైంలోనూ, ఆ తర్వాత ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చాక కూడా ఈ విమర్శలు కొనసాగుతునే ఉన్నాయి. ఇక ఇఫ్పుడు కూడా వివేక్ తన బాల్య స్నేహితుడిని వదలట్లేదు. అప్పట్లో కిరణ్ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూసేవాడని మరోసారి గుర్తుచేస్తున్నాడు వివేక్. ఆ సమయంలో తాను బయటపెట్టిన నిజాలతో కిరణ్ తనపై వ్యక్తిగతంగా కక్ష గట్టాడని అంటున్నాడు. అందుకే కిరణ్ తనకున్న కాస్త రాజకీయ పలుకుబడితో తన కంపెనీలపై పడుతున్నాడని, ఇలాంటి వాటికి బెదిరే ప్రసక్తే లేదని అంటున్నాడు. అంతేకాదు టీ.కాంగ్రెస్ సీమాంధ్ర నేతల ప్రభావం ఇప్పటికీ ఉందని, ముందు అది పోతేనే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వసనీయత పెరుగుతుందని ఆయన చెప్పారు. ఇక వరంగల్ ఉపఎన్నికపై స్పందిస్తూ... అధిష్టానం చెప్పినా సరే తాను పోటీకి దిగనని, తానింకా రాజకీయాల్లో రాటుదేలలేదని వివేక్ చెప్పారు. తమ కుటుంబం అంతా కాంగ్రెస్ కోసమే పని చేసిందని, తన విధేయతను హై కమాండ్ కూడా గుర్తించిందని అంటున్నారు. వేరే పార్టీ నుంచి ఉపఎన్నిక సీటు ఆఫర్ వచ్చినా తిరస్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వివేక్ చెబుతున్నారు.