పాతకాల దినపత్రిక నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ఆస్తులను అప్పనంగా దోచుకున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసులో నేడు పాటియాలా కోర్టుకు హాజరుకానున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు పోలీసు అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తే, బెయిలుకు దరఖాస్తు చేయరాదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ కేసును మోదీ సర్కారు రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు వాడుకుంటోందని ఇప్పటికే వీరిరువురూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక కోర్టుకు వెళ్లే వీరు తిరిగి ఇంటికి వస్తారా? జైలుకు వెళతారా? అన్న విషయమై కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మోదీ సర్కారు విధానాలను ఎండగట్టే దిశగా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని సోనియా, రాహుల్ లు తమ అనుచరగణం వద్ద స్పష్టం చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు సమీపంలోని పలు దుకాణాలు మూసివేయించారు. కోర్టు ప్రాంగణంలో మరో 16 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీసుల బలగాలతో పాటు, ప్రత్యేక భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు భారీగా కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో సోనియా, రాహుల్ లు తొలిసారి కోర్టుకు వస్తుండటంతో దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే కాసేపట్లో జరిగే విచారణలో అసలేం జరుగుతుంది, కోర్టు ఏవిధంగా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.