తెలుగు రాష్ట్రాలు రెండు ముక్కలయ్యాక ఇరు ప్రాంతాల్లోని నేతలు కూడా భాయి భాయి అంటూ సూక్తలు చెప్పటం మనం చూస్తున్నాం. ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లాగా కలిసుందాం అనే నినాదంను ఇస్తూ ఆయా ప్రాంతాల ఓటర్లను ఆకట్టుకునేందుకు గాలం వేయటం చేస్తూ వస్తున్నారు. అక్కడి వారు ఇక్కడ వారు పర్యటిస్తూ అప్యాయతలను ఒలకబోస్తున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అది ఊపందుకుంది. అందులో భాగమే నేతల నుంచి పంటిలో ముళ్లు కాలితో తీయటం, ఆంధ్రావారి కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వటంలాంటి స్టేట్ మెంట్లు.
టీడీపీ నుంచి అధికార పార్టీలోకి భారీగా వలసలు కడుతుండటంతో పార్టీ ఉనికికి ప్రమాదంగా మారిందన్న ఆలోచనతో తనయుడు లోకేష్ ను సీన్లోకి దించాడు చంద్రబాబు. ఇక జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్న లోకేష్ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపేలా ప్రసంగాలు చేస్తూ ఆకట్టకుంటున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి అధినేత చంద్రబాబు రాయలసీమకు చెందిన వారని, తల్లి భువనేశ్వరి ఆంధ్రాకు చెందిన వారని, తాను మాత్రం అసలు సిసలైన హైదరాబాదీనేనని తెలిపాడు.
హైదరాబాద్ కు అంతర్జాతీయ ఖ్యాతి రావటానికి తెలుగుదేశం కారణమని చెప్పిన ఆయన. అధికారన్ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. అంతేకాదు తాను ఇక్కడే పుట్టానని ఇక్కడి వారి కోసం కృషి చేసేందుకు పార్టీ తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాడు. మొత్తానికి నేతల వలసలతో మరణశయ్యపై ఉన్న పార్టీకి బాధ్యతలు స్వీకరించి తిరిగి ఊపిరి పోస్తున్నాడు లోకేశ్.