శత్రుఘన్ సిన్హా ప్రేక్షకుల అభిమాన హీరో. సోనాక్షి సిన్హా ప్రేక్షకుల చేతికి అందొచ్చిన తర్వాత శతృ అంకులుగా అందరికీ ఇంకా ఇష్టుడై పోయాడనేది కఠోరమైన వాస్తవం. అందగత్తెకి తండ్రి అయితే అంతేమరి. రాజకీయంగా బిజెపి పక్షపాతి. సీనియరు నాయకునిగా పరిణతి చెందిన అంకులు. ఏదో గ్రహస్థితి సవ్యంగా లేక అపోహలు, అపార్థాలు పేట్రేగి బీహారు ఎన్నికల తదనంతరం పార్టీ ఈ బీహారీ బాబుపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటుంది అని అభిజ్ఞవర్గాలు అంటున్నాయి. అసలే ఫైర్ బ్రాండ్... దీంతో తుపాకి రాముడికి మండింది. ఇంతవరకు తన సేవలను సుష్టుగా వాడుకుని తనని అవమానించడం మింగుడు పడలేదు. పార్టీలో సంబంధిత కుట్రదారులందరినీ ఉతికి ఆరేసి ఒక్క మోదీని మాత్రం ఎందుకైనా మంచిదని గిల్లకుండా వదిలేశాడు, ముందు చూపుతో. తన జోలికి వస్తే ఏం జరుగుతుందో తెల్సా అంటూ, సశాస్త్రీయంగా అంటే ఫిజిక్స్ సాక్షిగా సర్ ఐజాక్ న్యూటన్ మూడో సూత్రాన్ని ఉటంకించేడు. అది బాల విద్యార్థులందరికీ సుపరిచతమైనదే- ప్రతిచర్యకూ సమానమైన ప్రతిచర్య ఉండి తీరుతుంది- పార్టీ క్రమశిక్షణ చర్యకు పూనుకొంటే ప్రతిగా దేన్లో దూకుతాడో ఈ కాళీచరణ్.