చౌక మద్యం తాలూకు విధివిధానాలు తయారవుతున్నాయి. ఖజానా కళకళలాడబోతోంది. గుడుంబా వెలవెల బోవాలె. హరిబ్రహ్మాదులు అడ్డొచ్చినా మండల కమండలాల్లో చవక మద్యం ఏరులై పారాల్సిందే, పదిరూపాయల గుడుంబా బదులు పదిహేను రూపాయల చీప్ లిక్కరు తాగి ఊగాల్సిందేననే భావం ప్రాప్తించేలా అధినాయకుడు ఉద్ఘాటించేడు.
భరతసింహరెడ్డిగారి శ్రీమతి అరుణ ఈ దుర్మార్గాన్ని ఖండించింది. బావగారికి కలిగిన సంపద మూలాలు అక్కకు తెలుసు. ఇవన్నీ సమీక్షించుకొని నువ్వెలా పోతే పో, ప్రజల కాలేయాలతో వేషాలెయ్యవద్దు యధా దొరా, తథా ప్రజా అనేలా ప్రవర్తించొద్దు అని సుద్దులు చెప్పేరు.
మంత్రి పద్మారావు, ఆరోగ్యకరమైన పదిహేను రూపాయల లిక్కరు ఏర్పాటుచేస్తుంటే ఈ నసంతా ఏమిటి అని చిరాకుపడటం జరిగింది. ఇది ఎంతో తర్జన భర్జనలు జరిగి మేధోమథనం చేసి రూపొందిస్తున్న పాలసీ. ఏవిధమైన శంకలు పెట్టుకోవద్దు అని మంత్రి భరోసా ఇచ్చేరు. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి రాగలదని కూడా ప్రకటించేరు. ఒక చరిత్రాత్మక నిర్ణయంతో విప్లవాత్మకమైన మార్పు వచ్చే సందర్భంగా అభం, శుభం, శాస్త్రం వల్ల కాదు అన్నీ పరిగణనలోకి తీసుకోవాలనే జ్నానం అత్యంత ఆవశ్యకం. అక్టోబర్ 1 తర్వాత 2 యొక్క ప్రాముఖ్యత తెలుసా? ద్వితీయ విఘ్నం ఉండొచ్చా చీప్ లిక్కరు మంత్రిగారూ!