కేంద్రంలో తిరుగులేని అధికారం చెలాయిస్తున్న బీజేపీకి పెద్ద కష్టమే వచ్చి పడింది. బీహార్ ఎన్నికలకు సంబంధించి కమలానికి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఓవైపు గుజరాత్ యువ సంచలనం హర్థిక్ పటేల్ బీహార్ ఎన్నికల్లో దెబ్బ కొట్టేందుకు ర్యాలీలు చేపట్టేందుకు సిద్ధమౌతుండగా, తాజాగా మరో అంశం బీజేపీ కి ముచ్చెమటలు పోయిస్తోంది. హర్థిక్ ర్యాలీలతో బీజేపీ ఓట్ల శాతానికి గండిపడటం ఖాయమేనని విశ్లేషకులు తాజా పరిణామంతో బీజేపీకి భారీ ఓటమి తప్పదనే భావిస్తున్నాయి. ఇప్పుడు శివసేన పార్టీ కూడా మిత్రపక్షం బీజేపీకి భారీగానే హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తోంది.
తాజాగా ఎన్డీఏ భాగస్వామి అయిన శివసేన సొంతంగా బీహార్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన శివసేన, ఆ పార్టీకి అధికారం చేజిక్కడంలో రోజుల తరబడి సస్పెన్స్ కొనసాగేలా చేసింది. ఒకానొక సమయంలో బీజేపీ, శివసేనలు దాదాపుగా వైరి పక్షాలుగా మారే పరిస్థితీ వచ్చింది. అయితే 25 ఏళ్లుగా సాగుతూ వస్తున్న మైత్రిని కొనసాగించేందుకే ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
ఇక బీహార్ లో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు బీహార్ వెళ్లిన ఆయన బీహారీలు అడగకున్నా, రూ.1.25 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ప్రస్తుతం బీజేపీ జోరుగా ప్రచారం సాగిస్తోంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయనగా శివసేన నిన్న బీజేపీకి షాకిచ్చే ప్రకటన చేసింది. బీహార్ లో 150 సీట్లకు ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రకటించారు. బీహార్ లో అంతగా ఓటు బ్యాంకు లేని శివసేన, 150 స్థానాల్లో పోటీ చేసి సాధించేదేమిటంటూ బీజేపీ నేతలు లోలోపలే రగిలిపోతున్నారు. మిత్రపక్షం వేరుగా బరిలోకి దిగితే తన ఓటు బ్యాంకుకే గండి పడుతుంది కదా అన్న కోణంలో బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మజ్లిస్ ఎన్నికల బరిలో దిగుతున్నందునే శివసేన కూడా అక్కడ భారీగా సీట్లకు పోటీ చేస్తుందని ఓ టాక్ నడుస్తోంది. ఏదేమైనా బీహార్ ఎన్నికల బరిలో దిగి బీజేపీ కి శివసేన పెద్ద షాక్ నే ఇస్తుందని చెప్పొచ్చు.