రైతుల వరుస ఆత్మహత్యలతో కలకలం రేగింది. దేశంలోనే ఆ జాబితాలో రెండో స్థానంకి చేరింది తెలంగాణ. ప్రతిరోజూ సుమారు ఐదారుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటిని ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. మంత్రులు ఖండిస్తున్నారు. ప్రజా సంఘాలు పౌర సంఘాలు పత్రికలు అంతా ఖండిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది. కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తెలంగాణ వచ్చాక అనే కంటే ముఖ్యంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వివిధ వర్గాల ఆత్మహత్యలు సర్వ సాధారణం అయ్యాయని చెప్పుకొవచ్చు. ముందు పింఛనుదారులు, ఆపై రైతులు, తర్వాత చేనేత కార్మికులు ఇలా ఒకరి తర్వాత ఒరరు ఆత్మహత్యలకు పాల్పడుతూ వస్తున్నారు. ఏడాదిన్నరగా ఇవి కొనసాగుతున్న ప్రభుత్వం వాటిని వద్దనటం కానీ, కనీసం విజ్నప్తి చెయ్యటం కాని చెయ్యలేదు. ముఖ్యమంత్రిని పక్కన పెట్టిన ఉద్యమ సమయంలో రైతులపై ప్రేమ చూపిన మిగతా వారెవ్వరు కూడా ఆత్మహత్యలపై స్పందించలేదు.
ఇక ఇప్పుడు తీరిగ్గా పరిహరం పేరుతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. మొన్నామధ్య ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత ప్రకటించారు. వారికి ఆర్థిక సాయం అందించటంతోపాటు అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇక తాజాగా డిప్యూటీ సీఎం పరిహరం పెంపు పై మీడియాతో మాట్లాడారు. కేబినెట్ తీర్మానం మేరకు పరిహారాన్ని లక్షా యాభై వేల నుంచి 6 లక్షల రూపాయలకు పెంచినట్లు ప్రకటించారు. ఓవైపు వర్షాలు లేని పరిస్థితులు, కుటుంబ పోషణ భారంగా ఉన్న స్థితుల్లో ఆరు లక్షలు అంటే ఎవరికైనా ఆశ పుడుతుంది. దీనివల్ల ఆత్మహత్యలు మరింత పెరిగే ప్రమాదం ఉండొచ్చు.
కేసీఆర్ చేతికి ఎముక లేదన్న సంగతి మనకు తెలుసు. అయితే ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఆదర బాదరగా తీసుకోవటం పెద్ద తప్పుడు నిర్ణయంగా భావించాల్సి వస్తుంది. వారిలో ధైర్యం నింపాలి, లేదా ప్రత్యామ్నయం వెతకాలి అంతే గానీ చనిపోయిన వారికి పైసలు చెల్లిస్తామని చెప్పటం కరెక్ట్ కాదు. సంక్షేమమే ధ్యేయంగా పని చేసే ప్రభుత్వం చెయ్యాల్సిన పనికాదు. మనోధైర్యం నింపాల్సింది ఒక్క మీడియానే కాదు... ముందు ప్రభుత్వం, పాలకులు ఆ తర్వాత నేతలు.