సోమనాథ్ భారతి అనే పేరున్న ఆమ్ ఆద్మీ పార్టీ మగమంత్రి వివాదాలకు ప్రసిద్ధి. మంత్రి కాగానే సెక్రటరీని పిలిచి జిల్లా జడ్జిలనందరిని తక్షణం హాజరుపరచమని హుకుం జారీచేశాడు. పద్ధతికాదని చెప్పిన సెక్రటరీ చివాట్లు తిన్నాడు. మరోసందర్భంలో సీనియర్ వకీల్ హరీష్ సాల్వే సీనియర్ బీజేపీ మంత్రి అరుణ్ జైట్లీని మొఖాల మీద ఉమ్ముతానన్నాడు. ఎంతమంచి మాట కదా! ఒకసారి కార్లో వెళుతూ మధ్యలో దిగిపోయి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే ఓవర్ యాక్షన్ చేసి జడ్జిగారితో క్లాస్ పీకించుకున్నారు.
ఈ బుద్ధిమంతుడి సహాధ్యాయుల్ని అడిగినా, ఎపుడూ కుదురుగా ఉండే కుర్రాడు కాదు అని బోల్డు కథలు చెపుతారు. భార్య నలభై ఏళ్ల లిపి కామిత్ర కూడా ఈయనగారితో వేగలేక గృహహింస, మానసిక వేదనకు లోను చేస్తున్నాడని కేసు పెట్టింది కూడ. ఈ ప్రేలాపనల తర్వాత కూడా ఆమె స్ర్కీన్ పైకి వచ్చి నా భర్త అందమైన ముఖాలనే చూస్తాడు అని వ్యంగ్యంగా స్టేట్ మెంట్ ఇచ్చిదంటే ఆమెకు ఏపాటి కాలి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ సారుకి ఇప్పటివరకు సంపాదించుకున్న కితాబులు, పతకాలు కొత్తగా క్రమశిక్షణకు మారుపేరయిన ఈ భారతీయుడు, ఢిల్లీ పోలీసు శాఖపై మాపార్టీకి సంపూర్ణ అధికారం దఖలుపరిస్తే అందమైన అతివలు అర్ధరాత్రి కూడ రోడ్లమీద భద్రంగా తిరిగే హమీ ఇవ్వగలం అంటూ అందమైన అనే మాటకి కొంచెం నిజాయితీ జోడించేడు. ఈ అతి చేష్టలకి మహిళా సంఘాలు ఏం చేద్ధాం అని ఆలోచనలో పడ్డారని తెలిసింది. గాంధీగారిలాగే మాట్లాడితే తన గొప్పేముంది అనుకున్నామేమో ఈ వికటకవి!