ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ నేత చేసిన కామెంట్లు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమౌతున్నాయి. పంజాబ్ అశాంతికి కాంగ్రెస్ పార్టీనే మూలకారణమా? కాంగ్రెస్ ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపిందా?. అవన్నీ నిజాలే అంటున్నారు పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్. జాతి వ్యతిరేక శక్తులకు నిధులు ఇస్తూ, వారిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తీవ్రవాదులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆయన ఆరోపించారు. ప్రతీ ఒక్కరికీ తెలుసు 80లో పంజాబ్ పరిస్థితి ఎలా ఉండేదో. వందల మంది పంజాబీలు ఊచకోతకు గురయ్యారు. మతపరంగా అల్లకల్లోలాలు చెలరేగాయి. పదిహేనేళ్లు పంజాబ్ అతలాకుతలం అయ్యింది. ఇదంతా కాంగ్రెస్ పుణ్యమే అని ఆయన అన్నారు. అసలు ఉగ్రసంస్థలు దేశంలోకి చొరబడేందుకు లైసెన్స్ ఇచ్చిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. అమృత్ సర్ ఊచకోతకు కాంగ్రెస్ ఉన్న సంబంధం ఏంటో లోకం మొత్తానికి తెలుసని ఆయన అన్నారు.
మరోవైపు, సుఖ్ బీర్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. తమ చేతగానితనాన్ని ఇతర పార్టీలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.