అఖండ మెజార్టీతో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇటీవలె అధిరోహించారు పురచ్చితలైవి జయలలిత. లెక్కకు మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చి జైలు శిక్ష విధించడం తెలసిందే. ఆ సమయంలో ప్రజల్లో ఆమె పట్ల నెలకొన్న సానుభూతి అంతా ఇంతా కాదు. తర్వాత బెంగళూర్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన సమయంలో ఆమె అభిమానులు పండగ చేసుకున్నారు. ఎంతలా అంటే వారు చేసిన సంబరాలపై దేశవ్యాప్త చర్చ జరిగింది. అదే జోరులో జరిగిన ఉపఎన్నికల్లో జయ ప్రత్యర్థిని చిత్తుచిత్తు చేసి రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసింది. అయితే అమ్మ గారికి సుబ్రహ్మాణ్యం వార్లు వేసిన తలపోటు మళ్లీ తప్పేలా లేదు. డీఎంకే వదిలినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఆమెను వదలనంటోంది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం లో ఓ పిటిషన్ ను దాఖలు చేసింది. ఇక సోమవారం ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జయకు నోటీసులు జారీచేసింది. దీంతో మళ్లీ ఆమెకు రాజకీయ కష్టాలు మొదలవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఉన్నత న్యాయస్థానంలో ఆమె తరపు వాదనలు ఎలా ఉండబోతున్నాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొనగా, ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారట.