అయ్యగారు అనంతపురం, పుట్టపర్తి ప్రాంతాలు సందర్శించిన సందర్భంగా అనేక సలహాలు, హామీలు, సూచనలు అభిప్రాయాలు, అనురాగాలు, వగైరాలు పంచిపెట్టేరు. గతంలో అయ్యగారు అధికార దర్పం చవిచూసిన వారే. ఉపకారం చెయ్యగలిగిన రోజుల్లో అన్నీమూసుకుని ఇప్పుడెందుకంట ఆరాటం, హడావుడి. ఒక ప్రక్క జగన్ మరోప్రక్క రాహుల్ రైతులకు భరోసా ప్రదానం చేస్తున్నారు. మాటల సందర్భంలో ఆంధ్రలో ప్రతిపక్షం లేకుండా పోయిందని రాహుల్ అంటే జగన్ కి కించిత్ ఆగ్రహమొచ్చింది. అంతేగానీ ఆ మాటలో తన దుకాణం కూడా క్లోజయిన వైనం ఒప్పుకున్నారని గ్రహింపులేకపోతే ఎలా?
ప్రత్యేక హోదా గురించి కూడా రాహుల్ గట్టిగానే మదనపడ్డారు. అనగా కాలిన చేతులు, దొరకని ఆకులు! హోదా విషయంలో కొంచెం నిజాయితీ చూపిస్తే తల్లి చేసిన పాపం కొంతయినా ఉపశమించగలదు. ఈ గోలలో జర్నలిస్టు బుద్ధిమంతుడొకడు రాహుల్ ను కన్నెచెర ఎప్పుడు వీడుతుందో గదా అని ముఖాముఖి పరామర్శించేడు. అంతే, బ్రహ్మచారికి ఎక్కడ గుచ్చుకుందో మరి... బుస్సుమన్నాడట!