గురువారం ఉదయం తెలంగాణ రాజకీయాల్లో కలవరపాటు జరిగింది. వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు కీలకనేతలు తమ తమ సొంత గూటిలకు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీ టీడీపీ సీనియర్ నేత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రభాకర్ లు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వీరిరువురిని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నేటి ఉదయం ఊహించని విధంగా సాయన్న, ప్రభాకర్ లు టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును కలిశారు. వారిద్దరినీ హరీశ్ రావు సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. స్వల్ప చర్చ తర్వాత వారిని కేసీఆర్ తన పార్టీలోకి చేర్చుకున్నారు. కేవలం నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పరిణామాలతో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు షాక్ కు గురయ్యారు. తాజా పరిణామాలతో తదుపరి చర్యల కోసం ఆయా పార్టీల నేతలు సమాయత్తమవుతున్నారు.
టీడీపీ తనకు ఎప్పుడూ అన్యాయం చేయలేదని, అదే టైంలో సీనియర్ అయినప్పటికీ తనకు ప్రాధాన్యం దక్కలేదని సాయన్న అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు. జంటనగరాల్లో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులతో జీహెచ్ ఎంసీలో టీఆర్ఎస్ పుంజుకుంటుందని చెప్పారు.
టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాక జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సాయన్న లాంటి కీలక నేత పార్టీ వీడనుండటంతో టీడీపీకి పెను నష్టం తప్పేలా లేదు.