ఓ వైపు నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా రాదు, ఇవ్వబోం అంటూ రోజుకో పెద్ద తలకాయ వ్యాఖ్యలు చేస్తుంటే, ఇక్కడున్న నేతలకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లయినా లేదు. జనాలు రోడ్డెక్కి ఉద్యమించేలోగా ప్రభుత్వం కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రజలకు మనోధైర్యాన్ని పంచాల్సిన నేతలే కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం విడ్డూరంగా మారింది. ఈ క్రమంలో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఏపీ ప్రజలపై ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.
ఆంధ్రా ప్రజలకు తొందర ఎక్కువని, ఏ విషయంలోనూ ఓపిక పట్టే సహనం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచిన మర్నాటి నుంచే ప్రత్యేకహోదా ఇవ్వటంలేదు, రైల్వేజోన్ ఇవ్వలేదనడం సరికాదన్నారు. కేసీఆర్ పోరాటం మొదలుపెట్టగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, అందుకు పదమూడేళ్ల సమయం పట్టిందని అన్నారు. ఆంధ్రా ప్రజలకు తొందర పక్కనబెట్టి, కొంచెం ఓపికగా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారు. హామీలు సాధించుకునేందుకు సహనం కావాలని వ్యాఖ్యానించారు. కేంద్రం ఏ రాష్ట్రం మీద కక్ష కట్టదని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుందని ఆయన అన్నారు. ఇంకోవైపు బీజేపీ నేత రఘునాథ్ బాబు మాట్లాడుతూ... ఉత్తరాఖండ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రెండేళ్లకు గానీ ప్రత్యేక హోదా రాలేదని, ఏపీకి ప్రత్యేకహోదా రావడానికి సమయం పడుతుందని అన్నారు. కేంద్రం నుంచి అటువంటి ప్రకటనలు వస్తున్న సమయంలో ఓపిక, సహనం అంటూ వ్యాఖ్యానించడం ప్రజలను మరింత రెచ్చగొట్టడం అవుతుందే తప్ప ఒరిగేది ఏంలేదని నేతలు గుర్తుంచుకుంటే మంచిది.