కుంభవృష్టితో వరదలతో చెన్నై ఎంత నష్టపోయిందో లెక్కల్లో తెలియకున్న కంటికి కనిపించే దృశ్యాలు ఆ భీభత్సాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆ వరద తాకిడి నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తాకింది. చెన్నై కి వచ్చిన వరద కాకపోయినా అందులో కొంత వచ్చినా సరే అమరావతి అతలాకుతలం అవుతుందని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. మొత్తం 50 వేల ఎకరాలు కాగా, సాధారణ వర్షపాతానికే 13 వేల ఎకరాలు, భారీ వర్షాలు కురిస్తే 25 వేల ఎకరాలు, ఇక ఇప్పుడు చెన్నైలో కురిసినట్టు కుంభవృష్టి కురిస్తే మొత్తం రాజధానే నీట మునుగుతుందని అంచనా వేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. శివరామకృష్ణన్ కమిటీ కూడా తన నివేదికలో అమరావతికి ముంపు ప్రమాదం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిందని, అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందంటూ కథనాలు వెలువరుస్తుంది. ఇక దీనికి తోడు కాంగ్రెస్ కూడా జత కలవటంతో ప్రభుత్వం మండిపడుతోంది.
అమరావతిలో వరదలు సంభవిస్తాయని, చెన్నై కన్నా ఎక్కువే ముప్పు పొంచి ఉందంటూ వారు చేస్తున్న ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. రాజధానిపై కుట్రలు చేయటం ప్రతిపక్షం ఇంకా మానుకోనట్లుందని ఆరోపించారు. విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అమరావతిలో విపత్తులు సంభవిస్తాయంటూ దుష్ప్రచారం చేయటం మూర్ఖత్వం అని అంటున్నారు. అసలు ప్రకృతి విపత్తులు సంభవించని ప్రాంతం అంటూ ఏదైనా ఉంటే అది వైసీపీయే చెప్పాలని ఆయన ఎదురు దాడికి దిగారు. రాజధానిపై లేనిపోని అపోహాలు సృష్టించటమే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ లు లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. జగన్, కేవీపీ, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణలు అంగారక గ్రహంపైకి వెళ్లి జీవించాలని రాజేంద్రప్రసాద్ వారికి సూచించారు. వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజధాని విషయంలో ఇలా అనవసర రాద్ధాంతాలు చేయటం, ప్రజల్లో భయాందోళనలు కలిగించటమే అవుతుంది తప్పా ఇంకోటి మాత్రం కాదు.