ఓటుకు నోటులో కేసు తో కొంతకాలం కామ్ గా ఉన్నా రేవంత్ రెడ్డిలోని సింహం నిద్రలేచింది. కోర్టు కట్టడితో ఇన్నాళ్లు సొంత నియోజకవర్గం కొడంగల్ లోనే ఉన్నా ఆయన, తిరిగి కోర్టు అనుమతితోనే నేడు హైదరాబాద్ లో అడుగుపెట్టారు. అడుగుపెట్టిపెట్టగానే సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సినిమా డైలాగులతో ఆయనపై విరుచుకుపడ్డారు. సింహం సింగిల్ గా వస్తుందని తెలిసి కేసీఆర్ చైనా చెక్కేశాడు. ఇది మా అడ్డా... ఇక్కడే ఉంటాం అంటూ మండిపడ్డారు. ‘తెలంగాణ లో ఆట మొదలైందని కేసీఆర్ అన్నారు. కానీ, మొదలైంది ఆట కాదు... వేట. బంగారు తెలంగాణను తెస్తాని ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారం దక్కించుకున్న కేసీఆర్, రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు. నేనేం నీకు మందులో సోడా పోసే తరహా మంత్రిని కాదు, త్వరలో నీ అంతు చూస్తా’ అంటూ ఘాటుగా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఓవైపు ఇలా డైలాగులు పడుతుంటే కార్యకర్తలంతా ఉత్సాహంతో కేకలు వేస్తూ ఉన్నారు.
ఫామ్ హౌజ్ పై ఉన్న శ్రద్ధ రైతుల పై ఉంటే బాగుండేదని అన్నారు. తనకు తాబేదార్లుగా ఉన్న మంత్రులను వెంటబెట్టుకుని వెళ్లిన కేసీఆర్ కు ఇంగిత జ్నానం లేదని రేవంత్ అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వెళ్లిన బృందంలో ఆర్థిక మంత్రి లేకపోవటమేంటని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాత్రి తాగితే తెల్లారి ఖాళీ అయిపోవటానికి తెదేపా ఏం మందుబాటిల్ కాదంటూ తనదైన శైలిలో మాటల బాణాలు సంధించారు. ఈ సందర్భంగా కొంతమంది టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు రేవంత్ సమక్షంలో టీడీపీలో చేరారు. మొత్తానికి రేవంత్ రీఎంట్రీతో తెలుగుదేశం పార్టీ కి మళ్లీ కొండంత బలం చేకూరినట్లయ్యింది.