కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగి, ఆ తర్వాత వైసీపీలో ఇమడలేక టీడీపీ గూటికి చేరుతున్న మాజీ మంత్రి, విశాఖ జిల్లా సీనియర్ రాజకీయ నేత కొణతాల చేరిక పెద్ద చర్చకే తెర తీస్తోంది. మొన్నటిదాకా రాజకీయ ప్రత్యర్థిగా కొనసాగిన కొణతాలను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ టీడీపీ స్థానిక నేతలు నిరసన గళం విప్పుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నంలలో ఆ పార్టీ నేతలు రెండు రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కొణతాల చేరికను ఎలాగైనా అడ్డుకుని తీరాల్సిందేనని ఈ భేటీల్లో నేతలు గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఇదే విషయాన్ని తమకు అనుకూలమైన నేతల ద్వారా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెవిన పడేలా చేస్తున్నారు. ఇటీవల వైసీపీకి చెందిన మరో కీలక నేత గండి బాబ్జీతో కలిసి కొణతాల హైదరాబాదులో చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వారిద్దరినీ వెంటబెట్టుకుని మరీ వెళ్లారు. సొంత పార్టీ నేతే కొణతాలను వెంటబెట్టుకుని వెళ్లిన వైనంపైనా స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.
అయితే కొణతాల చేరికపై పార్టీ కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని మంత్రి గంటా చెబుతున్నారు. అనకాపల్లిలో టీడీపీ కార్యకర్తలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. స్థానిక కార్యకర్తలు, కొణతాలకు మధ్య విభేదాలు ఉన్నాయని, వాటి నేపథ్యంలోనే ఆయనను వారు వ్యతిరేకిస్తున్నారని గంటా వెల్లడించారు. అయితే పార్టీ నిర్ణయమే అంతిమమని, దానికి అంతా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.