ఓటుకు నోటు వ్యవహారంలో ఓ ఆసక్తికరమైన అంశం విచారణలో బయటకు వెల్లడైంది. స్టీఫెన్ సన్ ఇంటికి సెబాస్టియన్ వెళ్లిన కారుకు అంటించిన మహానాడు స్టిక్కరే ఈ తతంగం మొతత్ బయటపడటానికి కారణమైందని తెలుస్తోంది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న మత్తయ్య ఈ విషయాన్ని చెబుతున్నాడు. పీకల దాకా అప్పుల్లో మునిగిపోయిన స్టీఫెన్ సన్ రుణాల కోసం విసిగి చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నాడట. ఈ విషయం తెలిసిన మత్తయ్య ముందుగా సెబాస్టియన్ తో చర్చలు జరిపారట. అనంతరం వారు స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లారట. అయితే సెబాస్టియన్ వినియోగించిన కారుకు మహానాడు స్టిక్కర్ ఉండటంతో ఈ విషయాన్ని గమనించిన స్టీఫెన్ సన్ గన్ మెన్ ఒకరు విషయాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలకు చేరవేశాడట. దీంతో హైదరాబాద్ పోలీసులు, ఇంటలిజెన్స్ వారు కాపుకాశాయట. ఆపై ఇదంతా నోటుకు ఓటు వ్యవహారమని నిర్థారించిన నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమాచారం అందించగా, ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దించిందట. ఈ క్రమంలో పక్కా ప్లాన్ రచించిన ఏసీబీ సీసీ కెమెరాలను అమర్చి పూర్తి సాక్ష్యాలతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిందట.