తెలంగాణలో టీడీపీ కి ఉన్న ఏకైక ఎంపీ మల్లారెడ్డి మాత్రమే. సార్వత్రిక ఎన్నికల్లో బలమైన టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని తట్టుకుని మరీ ఆయన మల్కాజ్ గిరి నియోజకవర్గంలో గెలుపొందారు. అయితే అప్పట్లో వియ్యంకుడు తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే సమయంలోనే ఈయన కూడా పార్టీ మారతారనే వార్తలు వచ్చాయి. కానీ, వాటన్నింటిని ఆయన కొట్టిపడేశాడు ఏదేమైనా టీడీపీని వీడేది లేదని ఖరాకండిగా చెప్పేశారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని తానెక్కడా చూడలేదని, ఆయన పనితీరుతో తెలంగాణలోని పేదలకు మేలు జరుగుతుందని మల్లారెడ్డి ప్రశంసించారు. మల్కాజ్ గిరి లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు. కేసీఆర్ లాంటి సీఎం ఉండటం మన అదృష్టమని, మంచి ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ నడుస్తుందని కితాబిచ్చారు. బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని పొగిడారు. పార్టీ ఉనికి కనుమరుగవ్వటంతోపాటు ఇటీవల రేవంత్ రెడ్డి వ్యవహార నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మల్లారెడ్డి కారెక్కిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.