ఓ ప్రభుత్వాఫీసర్ అయి ఉండి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. ఫలితంగా ఉన్నతాధికారుల నుంచి సస్పెన్షణ్ అనే బహుమతిని అందుకుంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేసింది, స్వామి అగ్నివేశ్ లాంటి జాతీయస్థాయి ఉద్యమకారులను కదిలేలా చేసింది. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న పోలీసాఫీసర్ ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసింది. స్వరాష్ట్ర కాంక్షే ఆమెతో ఆ పనిచేయించింది. ఆమె ఎవరో కాదు డీఎస్పీ నళిని. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామన్న యూపీఏ ప్రకటనతో ప్రాణంగా ప్రేమించే పోలీస్ శాఖలో తిరిగి చేరిపోయింది. ప్రకటనయితే వచ్చింది కానీ, రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు పడకపోవటంతో తిరిగి రాజీనామా చేసింది. ఆమె ఆశయాలకనుగుణంగా ఏడాది క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. అయితే తిరిగి ఆమె పోలీసాఫీసర్ గా కనిపిస్తుందన్న తెలంగాణ వాదుల ఆశ నేటికి నెరవేరలేదు. అంతేకాదు ఆమె ఎక్కుడుందో కూడా తెలియటం లేదు. గత కొద్ది రోజులుగా మీడియా ఆమె జాడకోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె ఆచూకీ లభించటం లేదు. మెదక్ డీఎస్పీగా ఉద్యోగంలో చేరిన ఐదు నెలలకే రాష్ట్రంపై మమకారం ఆమెను రాజీనామా చేసేలా ప్రేరేపించింది. మరీ అంతటి ఉద్యమశీలి ఇప్పటిదాకా అడ్రస్ లేకుండా పోవటం, ప్రభుత్వం కూడా ఆమె గురించి పట్టించుకోకపోవటం నిజంగా శోచనీయం.