అనుకున్నదే: వరంగల్ వార్ వన్ సైడ్ అయ్యింది

November 24, 2015 | 11:42 AM | 2 Views
ప్రింట్ కామెంట్
TRS-celebrations-in-warangal-by-poll-pasunuri-dayakar-niharonline

ఓరుగల్లు ఉప ఎన్నికల్లో అందరూ అనుకున్నట్లే వార్ వన్ సైడైపోయింది. ప్రత్యర్థులెవ్వరూ గులాబీ అభ్యర్థికి దాదాపు కనుచూపు మేరలో కూడా లేకుండా అయిపోయారు. దగ్గర దగ్గర 4 లక్షల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చుననే వార్తలు అందుతున్నాయి. ఈ నెల 21న జరిగిన వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 8 రౌండ్లు ముగిసేసరికే టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ దాదాపుగా విజయం సాధించేశారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లన్నిటిలోనూ టీఆర్ఎస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. టీడీపీకి పట్టున్న వర్ధన్నపేటలోనూ పసునూరికి భారీ ఎత్తున ఓట్లు పోలయ్యాయి.

                              ఇప్పటికే 3.50 లక్షల ఓట్లకు పైగా సాధించిన పసునూరి దయాకర్... తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 2.60 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీని సాధించారు. సర్వేకు కేవలం 75 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి దాదాపుగా 50 వేల ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి 6 వేల ఓట్ల లోపే ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ఓటింగ్ దాదాపుగా ఏకపక్షంగానే సాగిందని తెలుస్తోంది. విపక్షాలకు దిమ్మదిరిగేలా ఓటర్లు అధికార పార్టీ వైపే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టాయి.

పోలింగ్ కేంద్రానికి కాస్తంత దూరంగా, నగరంలోని పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ, బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కడియం శ్రీహరికి దాదాపు 3.90 లక్షల మెజారిటీ వచ్చింది. ఇప్పుడు దయాకర్ దాన్ని అధిగమించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ