ఆపరేషన్ ఆకర్ష్ ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. సుమారు 20 నెలల క్రితం ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ తరపున గెలిచిన వారు 63 మంది కాగా, ఈరోజు రిజల్ట్ తో ఆ సంఖ్య 82కి చేరింది. కేసీఆర్ 'ఆకర్ష్'తో వివిధ పార్టీలకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వరుస వలసలతో అధికార పక్షంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంటుందని ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు కూడా జోస్యం చెప్పారు. అయితే అంతా తలకిందులైంది. ప్రజల నాడి ఎవరికీ అంతుబట్టలేదు. కేవలం అభివృద్ధి నినాదంకే ప్రజలు పట్టం కట్టారు.
ఇక ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో తెరాసకు 82, కాంగ్రెస్ కు 16, ఎంఐఎంకు 7, టీడీపీకి 5, బీజేపీకి 5గురు ఎమ్మెల్యేలు ఉండగా, వైకాపా, సీపీఐ, సీపీఎంలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. ఈ లెక్కలను బట్టి చూస్తే, జూన్ లో రెండు రాజ్యసభ సీట్లకు జరిగే ఎన్నికల్లో రెండింటినీ కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.