సర్వత్రా ఉత్కంఠ రేపిన రేవంత్ రెడ్డి బెయిల్ వ్యవహారంకు ఓ ముగింపు పలికింది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ రిమాండ్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. రేవంత్‌కు బెయిల్ రాకుండా ఏసీబీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అంతేకాదు మత్తయ్య దొరకలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని విడుదల చెయ్యోద్దని తెలంగాణ అడోక్వేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలను కోర్టు తొసిపుచ్చింది. ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి బయటికి వెళ్లితే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఏజీ వాదించినప్పటికీ కోర్టు వినలేదు. A-4 దోషిగా ఉన్న మత్తయ్య కోర్టును ఆశ్రయించిన సంగతి ఏసీబీ కి తెలీదా అని జడ్జి ఏజీ ని ప్రశ్నించారు. రూ. 5 లక్షలతోపాటు రెండు ష్యూరిటీలతో కూడిన బెయిల్ న్యాయస్థానం మంజూరు చేసింది. ఇక ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మరి కొద్ది సేపట్లో రేవంత్ రెడ్డికి చెందిన న్యాయవాదులకు అందే అవకాశం ఉంది. రేవంత్ తోపాటు నిందితులుగా ఉన్న ఉదయసింహా, సెబాస్టియన్ లకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. రేవంత్ తరపున న్యాయవాదులు అధికారిక బెయిల్ కాపీలను ఏసీబీకి అందజేసిన తర్వాత ఈ సాయంత్రానికి రేవంత్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది.