ఓటుకు నోటు వ్యవహారంపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ చిచ్చు పెట్టిన ఓటుకు నోటు వ్యవహారంతోపాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాలను అడ్డుపెట్టుకుని ప్రజల జీవితాలతో నేతలు ఆడుకుంటున్నారని ఆయన శైలిలో మండిపడ్డారు. విభజన తర్వాత 13 నెల్లలో హైదరాబాద్ లో ఉన్న వేరే ప్రాంతం వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయటం ద్వారా నేతలు, వారి పార్టీలు అంత లాభపడుతున్నారే తప్ప ఎవరికీ(ప్రజలకు) ఏ నష్టం ఉండదని జేపీ అభిప్రాయపడ్డారు. సమస్యలను పరిష్కరించక ముందే హడావుడిగా విభజనను ముగించారని, దానివల్లే ఇప్పుడు అనుభవించాల్సి వస్తుందని ఆయన చెప్పారు. జాప్యం చేస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నందున వెంటనే ఈ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించాలని జేపీ కోరారు.