ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులను కలిసి మరీ వారికి ధైర్యాన్ని కల్పించాడు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్. అంతేకాదు ట్విట్టర్లో ప్రభుత్వానికి విజ్నప్తి కూడా చేశాడు. దీంతో ఆ టైంలో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గి భూసేకరణ తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఇక ఇప్పుడు తిరిగి ఆ ప్రక్రియను చేపట్టాలని ప్రయత్నిస్తోంది. దీంతో రైతులు మరోసారి ఆదుకోవాలంటూ పవన్ ను వేడుకుంటున్నారు.
ఈ మేరకు గురువారం పవన్ పేరిట ఫ్లెక్లీలను వేయించి, వాటితో నిరసన తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం జరిగే భూసేకరణ ప్రక్రియను తామంతా వ్యతిరేకిస్తున్నట్లు వారు మీడియాకు తెలిపారు. రాజధాని పరిధి నుంచి పెనుమాక, ఉండవల్లి భూములను పవన్ కల్యాణే తప్పించాలని కోరుతున్నారు. తమను ఆదుకుంటామని గతంలో పవన్ హామీ ఇచ్చారని.. తాను ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకోవాలని రైతులు విన్నవించుకుంటున్నారు. తమ భూములను కోల్పోయేందుకు ఒప్పుకోమని చెబుతున్నారు. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో అయినా పవన్ కల్యాణ్ తమ సమస్యల పట్ల గళం విప్పుతారని ఆశిస్తున్నారు. మరి ఆయన స్పందిస్తారా చూద్దాం!